పెళ్ళి-పెటాకులు ఓల్డ్ కాన్సెప్ట్. అప్పట్లో పెళ్ళి చేసుకున్న తర్వాత పెటాకులు వచ్చేవి. ఇప్పుడు కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది. ముందు ప్రేమ......తర్వాత??? పెళ్ళా?????......చాలా దూరప్రయాణం....అక్కడికి చేరేలోపే పెటాకులు వచ్చేస్తున్నాయి.
అసలు ఈ ప్రేమలో పెటాకులు ఎక్కువగా ఎందుకొస్తున్నాయ్ అని నేను చేసిన పరిశోధనల సారాంశం ఏమిటంటే, మన కుర్రాళ్ళు తుప్పుపట్టిన, బూజు పట్టిన ప్రేమ సూత్రాలు ఇంకా ఫాలో అవటమే అని తేలింది. దాని ఫలితమే ఈ తెల్లకాగితం, ఐ మీన్ శ్వేతపత్రం ఉరఫ్ వైట్ పేపర్. నా తోటి కుర్ర ప్రేమికుల కోసం .....
* ఆ మధ్యన ఎవరో ఒకాయన ప్రేమించటం అంటే ప్రేమని ఇవ్వటం అని ఓ సినిమాలో ఓ సుత్తి సలహా ఇచ్చాడు. సినిమా హిట్టయ్యేసరికి కుర్రాళ్ళందరూ ప్రేమని షరతుల్లేకుండా ఇవ్వటం మొదలెట్టారు ఆ హీరో లాగా. కానీ పదాకులు ఎక్కువ చదివిన అమ్మాయిలు మాత్రం వేరే సినిమా చూసి ప్రేమని కేవలం తీసుకోటం మొదలు పెట్టి ఆపై తిరిగి ఇవ్వకపోగా, కనపడటమే మానేసారు. కాబట్టి సోదరులారా, ప్రేమిస్తున్నా ... ప్రేమిస్తున్నా అని ఒకటికి పదిసార్లు చెప్పటం మానెయ్యండి. రజనీ లాగా ఒక్కసారి చెపితే వంద సార్లు చెప్పినట్లే ఈ విషయంలో.
* మా కిరణ్ గాడు గతంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయి పేరు ప్రేమ. కళ్ళద్దాలు ఉండేవి. ఇంట్లో వీడి దోమ వ్యవహారం తెల్సింది. ఆర్గ్యుమెంట్లు జరిగాయి. ఓ రోజు ప్రేమని తీసుకుని నేరుగా ఇంటికెళ్ళాడు. వాళ్ళ నాన్నకి తిక్కరేగి, ఏం చూసి ప్రేమించావురా అని అడిగాడు కిరణ్ గాణ్ణి. ఏం చూసి అంటే ఏం చెప్తా డాడీ, ప్రేమ గుడ్డిది అన్నాడు. అది విన్న ప్రేమ, కిరణ్ తనని గుడ్డిది అని జాలితో పెళ్ళి చేసుకుంటున్నాడని చాచి ఓ చెంపదెబ్బ వాళ్ళ నాన్న ముందే కొట్టి వెళ్ళిపోయింది. కాబట్టి నోరుంది కదాని లొకేషన్లతో సంబంధం లేకుండా కొటేషన్స్ వాడకూడదు. మ్యాటర్ రివర్సయ్యే ఛాన్సులు ఎక్కువ.
* అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోకుండా అమ్మాయి కోసం కార్లు, షికార్లు అని డబ్బులు తగలెయ్యడం పాత పద్ధతి. కానీ నవలోకపు యువకుల్లారా, ముందు లోకాస్ట్ అప్రోచ్ ద్వారా పనికానిచ్చి, మీ ప్రేమ దోమగా కాకుండా సీతాకోకచిలుకలా మారిందన్న నమ్మకం కలిగినప్పుడే ఓ నాలుగు రూకలు ఖర్చుపెట్టుకోండి. ఇంతా కష్టపడ్డాక ఈ ప్రేమ దోమగా మారితే, మళ్ళీ పెట్టుబడి ఎవరు పెడతారు మీకు?
* ప్రేమించే అమ్మాయి ఎదురుగా నిలబడి ఎప్పుడూ ఐ లవ్ యూ అని పొరపాటున కూడా చెప్పకు. ఓ పక్కగా నిలబడి చెప్పటం వల్ల , మన మొహం చెళ్ళు మనిపించటానికి అమ్మాయికి అవకాశం తక్కువ. ఖచ్చితంగా చెప్పాలంటే, 45 డిగ్రీలు లేదా అంతకు తక్కువ కోణంలో కుడివైపు నిలబడి చెప్పటం ఎంతో శ్రేయస్కరం. ఖర్మకాలి ఎవరైనా భద్రకాళి కొడదామని ప్రయత్నించినా మన వంటికి జరిగే డామేజ్ చాలా తక్కువ. ఇది మర్చిపోయి, 90 డిగ్రీల లంబకోణంలో అమ్మాయి ఎదుట నిలబడి కూస్తే, ఇంకెప్పుడూ మరెవరితోనూ మళ్ళీ కూసే అవకాశం ఉండకపోవచ్చు.(గమనిక: ఈ చిట్కా కుడిచేతి వాటం అమ్మాయికి మాత్రమే పనికొస్తుంది, ఎడమచేతి వాటం అమ్మాయికి బాగా ఎడమవైపు నిలబడాలి. లేనిచో ఫలితాలు మరింత దారుణంగా ఉండవచ్చు)
* పెద్దల మాట చద్ది మూట. అలాగే పెద్దలు తిన్న చెప్పుదెబ్బలు కూడా చద్దిమూటలే. అందుచేత గతంలో చెంప దెబ్బలు మరియు చెప్పు దెబ్బలు తిన్న వాళ్ళని కలుసుకుని ఎలాంటి వంకర మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్దో తెలుసుకుని ఆ మాటలు ఎలిమినేట్ చెయ్యటం ద్వారా మన పరువు దక్కించుకోవచ్చు.
* త్వరగా తెమలని ప్రేమ చెరువులో దిగిన గేదెల్ని ఒడిసి పట్టుకునే జలగ లాంటిది. త్వరగా తెమిల్చి బయటపడ్డావా తప్పించుకుంటావ్, కాదు ఇంకా మునుగుతా అంటే ఆ జలగ నీ జేబునీ, నీ జాబుని కూడా పీల్చి పిప్పిచేయటం ఖాయం.
* ప్రేమ ఒక పద్మవ్యూహం లాంటిది. అభిమన్యుడిలా ఇరుక్కోక బయటపడే తెలివి కూడా ఉండాలి. ఎలా అంటే, రాజు, రాణి ప్రేమించుకుని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక దూకటానికి కొండెక్కారు. యమా ఫీలయిపోయిన మన రాజు గారు ఆవేశంగా ముందుకి లోయలో దూకాడు. అంతలో రాణి గారు మనసు మార్చుకుని "ప్రేమ ఎంత గుడ్డిది" (ఈ రాజు గాడు ఎంత గుడ్డివాడు అనర్ధం) అని ఎనక్కెళ్ళిపోయిందిట. ఆమాట విన్న రాజు, "ప్రేమకి చావులేదు" అని వాడి వీపుకున్న పారాచూట్ నొక్కి పైకొచ్చాట్ట. సో ఇషయం ఏందంటే, ప్రేమ ఫెయిలయిందని ఫీలైపోకుండా ముందుకి ఎల్లిపోవాలన్నమాట.
* ప్రేమ అనేది మాంచి హిట్ సినిమాకి ముందేసే న్యూస్ రీల్ లాంటిది. న్యూస్ రీల్ చిన్నగా ఉంటే, సినిమాని ఎంజాయ్ సెయ్యొచ్చు. అలాంటి న్యూస్ రీల్ లాంటి ప్రేమని సినిమా లాగా నడిపేసావ్ అనుకో, ఇంక పెళ్ళయ్యాక నీకు మిగిలేది సినిమా కాదు, న్యూస్ రీలు. ఇంతకనా ఎక్కువ నేను సెప్పలేను.
బెస్ట్ ఆఫ్ లక్............
No comments:
Post a Comment