Sunday, March 27, 2011

ఇదే సగటు మనిషి జీవితం

మీరు ఆనందంగా ఉండండి మనుషులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు...
దుఃఖంలో ఉంటే వాళ్ళే వెనుదిరిగి పోతారు..
మీ ఆనందం పూర్తిగా వాళ్ళకి కావాలి..
కానీ మీ కన్నీళ్లు వాళ్ళకి అక్కర్లేదు...
సంతోషంగా ఉండండి మీకేందరో స్నేహితులు దొరుకుతారు,,
దిగులుగా ఉంటే వాళ్ళందర్నీ పోగొట్టుకుంటారు..
మీరు అందించే అమృతాన్ని ఎవ్వరు వద్దనరు..
కానీ విషాన్ని మట్టుకు మీరొక్కరే తాగాలి... ఇదే సగటు మనిషి జీవితం.

జీవితంలోని నగ్న సత్యాలు

నీటి బుడగలాంటి ఈ జీవితం ఎప్పుడు పోతుందో తెలియదు. ‘పుట్టేటప్పుడు ఒంటరిగా పుడతాము – పోయేటప్పుడు ఒంటరిగానే పోతాము’
ఉన్నంతవరకు డబ్బు, అధికారం, కీర్తి అనే కోరికలతో సతమతమౌతారు. జీవితంలో డబ్బుతో అన్ని కొనగలరా?
డబ్బుతో ఆహారాన్ని కొనగలరు కాని ఆకలిని కొనగలరా?
డబ్బుతో నిద్రపోవడానికి కావలసిన పట్టు పాన్పును కొనగలరు. కానీ నిద్రను కొనగలరా?
డబ్బుతో మంచి పుస్తకాన్ని కొనగలరు. కాని విజ్ఞానాన్ని కొనగలరా?
ఎంత డబ్బు, ఎంత హోదా సంపాదించామని కాదు. ఏం సాధించామని ప్రశ్నించుకోవాలి. ప్రతిక్షణం మనలాగా ఎంతోమంది పుడుతున్నారు, చ్చస్తున్నారు. కాని ప్రయోజనం ఏమిటి? ప్రతి ఒక్కరు తమ జీవితానికి ప్రపంచం గుర్తించే గొప్ప లక్ష్యాన్ని పెట్టుకొని ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆ లక్ష్యాన్ని సాధించినప్పుడే వ్యక్తి యొక్క జీవితానికి సార్ధకత ఏర్పడుతుంది.

జీవితంలో గెలవడానికి ప్రధానమైన మూడు అంశాలు :

1 . జీవితంలో గెలవడానికి ఆత్మా స్థైర్యం కావాలి : విజయం కోసం ప్రయాణించే దిశలో ఎన్నో అవరోధాలు ఎదురౌతాయి, వాటిని ఎదుర్కొని ఆత్మా స్థైర్యంతో ముందుకువెళ్ళాలి.

2 . జీవితంలో గెలవడానికి నేర్చుకొనే గుణం కావాలి. అన్ని విషయాలు ఒక్కరికే తెలియవు కాబట్టి కొత్త విషయాలు నేర్చుకునే గుణం కావాలి.

3 . జీవితంలో గెలవడానికి పరస్పర సహకారం కావాలి : అన్ని పనులు ఒక్కరే చేయలేరు కాబట్టి పరస్పరం ఇతరుల సహకారం పొందుతూ ముందుకు వెళ్ళాలి.

Sunday, March 20, 2011

అమ్మంటె

అమ్మంటె..

ఒక చాదస్తం..
జాగర్త జాగర్త అని పది సార్లు ఎందుకు..
నాకు తెల్వదా...

ఒక నస..
పొంగనే ఫోన్ చెయ్యిరా..
నేను పొయ్యేసరికే ఏదో అర్దరాత్రి అయితది.. పొద్దున చేస్తలే..

ఒక గోల..
తిన్నవారా..
ఎందుకడుగుతవ్ అన్ని సార్ల, తిన్నవా తిన్నవా అని..
నాకు తెల్వదా యేలకు తినాలని..

ఒక అమాయకత్వం..
ఎమొర గయన్ని నాకేం తెలుస్తయ్ కొడుకా..నువ్వయితె అంత మంచే కద..
ఇగ యేం తెలుస్తయమ్మ నీకు.. టీవీ కూడ సూస్తలెవ్వా..

ఒక సెంటిమెంటల్ ఫూల్..
వారానికొక్కసారే కదరా...
గా పిచ్చి పిచ్చి సీరియల్లు పెట్టి దిమాగ్ ఖరాబ్ చెయ్యకమ్మా..

ఒక ఫూల్..
ఔనా.. నా దగ్గర రెండు వేలున్నయిరా తీస్కొ మరి..
మా అమ్మని కొంచెం ప్రేమగ అడుగుతే ఎమన్న ఇస్తది..
శునకానందం..

ఒక లోకం తెల్వని పిచ్చిది..
అంత దూరం దేషం కాని దేషంల ఎట్లుంటవ్ కొడుకా..
గివన్ని చేశి, గింత కష్టపడి తీరా గిప్పుడు వీసా అచ్చినంక గిట్లంటవేందమ్మా, నీకెం అర్దం అయితది నా కష్టం ..

ఒక అతి జాగ్రత్త..
అన్ని సర్దుకున్నవా..పేపర్లు మంచిగ సూస్కో..
అబ్బా... ఎన్ని సార్లు చూస్కోవాల్నమ్మా..

మూఢ భక్తి..
అరె ఆగుర ..ఆగుర.. బొట్టు పెడ్త.. నా కోసం కొద్దిగ దేవునికి మొక్కి పోర..
నీకు తెలుసు కదమ్మ నేను నాస్తికున్నని.. మల్ల నన్నెందుకు బలవంత పెడ్తవ్..

ఇంతల నా ఫోనె మోగింది..
"అంతేనా...ఇంకేం కావాలి.. "
బొమ్మరిల్లు రింగ్ టోన్..
హాయ్ బంగారూ..
అవతల నా ప్రియురాలు..
అక్కడ కూడా అదే చాదస్తం..
దాన్ని బుజ్జగించి మరీ బయలుదేరానెందుకో..
ఎందుకో తట్టలేదు..


ఏరో ప్లేన్ ఎక్కినంక..
నేను నా దోస్తులు..
నేను నా ప్రియురాలు..
నేను నా తమ్ముడూ..
నేను నా కాలేజీ మజాలు..
నేను నా తండ్రి..
ఒక అరగంటయ్యింది..

అమ్మ ఎక్కడో మాయమయ్యింది..

నా లోపల ఇంకోక ఆత్మ ఉందేమో..
కోమాలో ఉందేమో...
అది చెప్పింది..
నువ్వూ నీ తండ్రీ
ఆనందంగ గడిపిన సమయంలో
నీ తల్లి నీకోసం వంటింట్లో సమాధయ్యిందేమో..
నీ కోసం..
ఒక సారి గుర్తు తెచ్చుకో..
మెల్లగా కళ్ళ నీళ్ళు తిరిగాయి...

నువ్వూ నీ తమ్ముడూ, నువ్వూ నీ నేస్తాలు..
నీకో వంద మంది మనుషులూ, సరదాలు, వ్యాపకాలు..
అమ్మ వ్యాపకాలేమి గుర్తు తెచ్చుకో..
నువ్వు తిరిగొచ్చే లోపల నీకిష్టమయ్యింది వండిపెట్టడం అమ్మ వ్యాపకం..

జాగర్త అని నస పెడుతుండి అమ్మ కదా..
ఆ జాగర్తే లేకుంటే నువ్వు ఇంత వాడివయ్యేవా..
నీకు రోగం అస్తె నీకు జాగర్తగ సేవ చెయ్యకుంటె,
ఇప్పుడు కనీసం బతికే వాడివా

పోంగనే ఫోన్ చేసుడే నీకు కష్టమాయే..
నీ ఫోన్ కోసం తెల్లందాంక నిద్ర పోని నీ అమ్మ కష్టాన్ని యేమనాలె..

తిన్నవా అని ఎందుకడుగుతవ్ పది సార్ల..
నువ్వు అడిగినవా ఆమె తిన్నదో లేదోనని..ఆమె తింటె కాదు
నువ్వు తిన్నవంటెనే ఆమె కడుపు నిండేది తెలుసా నీకు..


ఆమెకి యేం తెల్వది పిచ్చిది కదా..
నువ్వు బయటకు పొయ్యి లోకం చూస్తె..
ఆమె నిన్ను చూస్కున్నది మరి ఆ సమయం ల..

భోలా మనిషి కదా..
తెలివిగ బోల్త కొట్టించచ్చు..
మరి ఆమె చీర నీ వాక్మనుగా మారిందనే సత్యం తెలుసా నీకు..

నస పెడుతుంది అమ్మ కదా..
పైసలు ఎల్లక మీ ఇంట్ల మీ నాన పనిమనిషిని మానిపిస్తే మరి మీ అమ్మ కాళ్ళ నొప్పులు యేమయినయ్ అడుగలేదే ఒక్క సారి కుడ..

నువ్వా దిక్కుమాలిన దేశం పోతే నిన్ను ఆమెలెక్క సూస్కునేటోల్లు లేరని యేద్షింది గని నీ అబివ్రుద్దికి ఆటంకం కాదే..

దేవునికి ఒక్కసారి మొక్కుడె కష్టమాయే..
రోజు ఆమె మొక్కేది నువ్వు సల్లంగుండాలెనని తెలుసురా నీకు..

ఆమె యేడ్షిందే తెలుసు నీకు గని..
అది నీకోసమని తెల్వదా...
అప్పటికి అయిదు గంటలయ్యింది..
నా కన్నీళ్ళాగుతలెవ్వు...
మనసంత ఒకే మంత్రం..
అమ్మా అమ్మా అని..

ఎప్పుడు దిగుతానా ..
ఎప్పుడు అమ్మతో
మాట్లాడుదామా ...
యేడుస్తునే ఉన్నా...
ఎయిర్ హోస్టెస్ వచ్చి
విషయం కనుక్కుని వెల్లిపొయింది...
మా అమ్మ కాదుగా నా కన్నీల్లు తుడవగ..
ప్రయాణం ముగిసింది..
మాట్లాడాను..
ఎక్కడొ ..
ఇంకా అహంభావం..

ఆరు నెలల తరవాత..
నాన కాల్ లో ఓ సారి..
మీ అమ్మ నిద్రలో
కలవరిస్తుందిరా నీ పేరు..
అప్పుడప్పుడు
పక్క తడిమి చూసుకుంటుంది
నువ్వున్నావేమో అని..
తరవాత మట్లడతా..
ఉంటా నాన్నా..
నాకా శక్తి లేదు..
తట్టుకునేంత..

రెండు సంవత్సరాల తరవాత..
నిలుచున్నా
ఇంటి ముందర...
ఎవ్వరికి తెల్వది
నేనున్ననని..
గోడ దూకా..
నాకు తెలుసు
తాళం ఎక్కడుంటుందో..

అమ్మ
పొద్దున లేచింది..
నానా నువ్వేనా..
అమ్మ ఊహకందలేదు..
ఆష్చర్యమో..
ఆనందమో..
కలో నిజమో..
అమెరికాల కొడుకు
పొద్దున కల లో ..
కాని
కలలా లేని కలవరం..
అమ్మ యేడుస్తూనే ఉంది
నన్ను కావలించుకుని..
నసలాగ లేదు..
చాదస్తం కాదు..
ఎందుకంటే
చూసుకునే సరికి
నేనూ యేడుస్తున్నా డామిట్..
గంట పట్టింది
ఇంట్లో అంతా తేరుకునే సరికి..
పిచ్చి అమ్మ..
మనసులో అనుకున్న..
అమ్మ పిచ్చిది
యేం తెలుసు అమ్మకి..
యేం తెల్వది..
తెల్లారి డైమండ్ రింగ్ ఇచ్చా..
నాకెందుకు నానా ఇవన్నీ అంది..
"నువ్వింటికచ్చి
నా కల నిజం చేసినవ్
అదే కోటి వజ్రాల పెట్టు అన్నది.."
పిచ్చి ప్రేమ..
అమ్మ మొహంల ప్రషాంతత..
లవ్ యూ మా..
నా మనసు కేరింతలు కొట్టింది
అమ్మంటే ?
ఒక కేరింత..
ఒక పులకరింత.. oka friend rasadu...Chaitu

Saturday, March 12, 2011

అముల్యమైన జీవితం

అముల్యమైన జీవితం

ఆతి అముల్యమైన, అందమైన ఈ జీవితాన్ని మనం
రాగ ద్వేషాలతో, అసూయా , కపటాలు ,కార్పణ్యాలతో
దుర్భరం చెసుకుంటున్న వైనం శోచనీయం
నీటి బుడగ వంటిది ఈ జీవితం
కన్ను మూస్తే జననం
కన్ను మూస్తే మరణం
క్షణ భంగురమైన ఈ జీవితం కోసం
ఎందుకీ అనవసర ప్రాకులాటలు ?
తోటి వారిని మోసం చేయడం
హింసించడం , మానసికంగా గాయపరచడమెందుకు ?
సాటి వారిని ఆప్యాయంగా పలుకరిస్తూ
వారి కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ
వున్న దానిలో అన్నార్తులకు సహాయం చేస్తూ
ధర్మయుతంగా కోరికలు తీర్చుకుంటూ
భగవంతుడిచ్చిన దానితో సంతృప్తి చెందుతూ
ప్రసాద భావంతో ఆనందకరమైన
జీవితం గడపడమే వివేకవంతుల లక్షణం

దురాశ

దురాశ

దురాశ దు:ఖానికి హేతువు
కష్టానికి తగు ఫలిత మాశించక
అధికమైన కోరికలతో పరుగులు
తీయువారి జీవితం నిత్యం అశాంతిమయం
చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా !
ప్రయత్న సిద్ధి పైనే ఫలితం ఆధారం
అందనిది, అలవి కాని ఫలాన్ని అందుకోవాలని
యత్నించిన తప్పదు భంగపాటు
దురాశా రాహిత్యాన్ని అలవర్చుకొని
స్పష్టమైన లక్ష్య సాధనతో
చిత్త శుద్ధితో ప్రయత్నం గావించి
తుది ఫలితాన్ని భగవదార్పణ గావించి
ముందడుగు వేసిన వారే విజయ శిఖరాలను
అతి సులభం గా అధిరోహించగలరు

మాతృమూర్తికి తొలి వందనం

మాతృమూర్తికి తొలి వందనం



మాతృదేవోభవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిధి దేవోభవ అనే వేదోక్తిలో తల్లికే అగ్ర తాంబూలం ఇచ్చింది మన వేదం. హిందూ ధర్మంలోనే కాక అన్ని మతాలలో కూడా మాతృమూర్తికే తొలి వందనం అర్పించాలని ప్రవచించాయి. ప్రేమ, దయ,కరుణ,త్యాగాలలో మాతృమూర్తికి సాటి మరి ఎవరూ లేరు. ఆన్ని జీవుల హృదయాలలో అంతర్యామిగా కొలువు వుండే ఆ భగవంతుడు కళ్ళెదుట కనిపించే తన ప్రతిరూపం కూడా వుండాలన్న ఆలోచనతో మాతృమూర్తిని మనకు అందించాడు. అందుకే కనిపించని ఆ దైవానికి సజీవ ప్రతిరూపం “అమ్మ”. ఆ పేరులోనే ఎంత కమ్మదనం వుందో వర్ణింప శక్యం కాదు.

భార్యా భర్తల పవిత్ర సృష్టి కార్యం తర్వాత జీవుడు మాతృ గర్భంలో ప్రాణం పోసుకుంటాడు. నాటి నుండి అనుక్షణం పెరగడానికి అనువైన వాతావరణం తల్లి గర్భంలో సహజంగా రూపుదిద్దుకుంటుంది. తల్లి గర్భమే ఆ జీవునికి ప్రపంచం. తొమ్మిది మాసాల పాటు తల్లి ఆ శిశువును ఎంతో సంతోషంతో మోస్తుంది. శిశువు ఆరోగ్యంగా జన్మించాలని ఇష్టం వున్నా లేకున్నా ఎక్కువ మరియు అయిష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తుంది. మృత్యు సమానమైన ప్రసవ వేదనను ఎంతో సంతోషంతో భరిస్తుంది. ఛివరకు మరణానికి కూడా సిద్ధమై శిశువుకు ప్రాణం పోస్తుంది. అందుకే ప్రసవం అనేది అమ్మకు పునర్జన్మ అని అంటారు.ఆ క్షణం నుండి శిశువు సంరక్షణలో సర్వం మరిచిపోతుంది. తాను కన్నీళ్ళు ద్రిగమింగుకొని అమృతం వంటి స్తన్యాన్ని బిడ్డకు అందిస్తుంది. నిద్రాహారాలను మాని పిల్లల సంరక్షణే జీవితాశయంగా జీవించే అమ్మ ప్రేమను కొలిచే పరికరం ఏదీ లేదు.అమ్మ పవిత్ర ప్రేమకు,దయకు సాటి వేరొకటి లేదు. అందుకే భగవంతుడు తాను అమ్మ తర్వాతే పూజ్యనీయుడనని స్పష్టంగా చెప్పాడు.

బిడ్డ ఎదుగుతుంటే శ్వేతపత్రం వంటి మనసుపై ప్రపంచ జ్ఞానాన్ని ముద్రించే గురుతర బాధ్యతను మాతృమూర్తి స్వీకరిస్తుంది. అందుకే తల్లికే తొలి వందనం. తల్లియే తొలి గురువు. బిడ్డ మాటలు వచ్చాక పలికే తొలి పలుకు “అమ్మ”. పుట్టిన నాటి నుండి పాలతో పాటు విషయ పరిజ్ఞానాన్ని,లోక జ్ఞానాన్ని పంచి ఇస్తుంది.అందుకే పిల్లలందరూ ప్రపంచాన్ని తల్లి ద్వారా చూస్తారని అంటారు. తల్లి చీర కొంగు పట్టుకొని తొలి అడుగు వేస్తాడు బిడ్డ. తల్లి ప్రక్కనే వుంటే ఈ ప్రపంచాన్నే జయించగలమన్న ఆత్మ స్థైర్యం వారిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.ఏది తప్పో – ఏది ఒప్పో కూడా తల్లి ద్వారానే నేర్చుకుంటాడు. అందుకే మహాత్మా గాంధీజి, చత్రపతి శివాజీ, స్వామి వివేకానంద వంటి మహనీయులందరికీ తల్లియే స్పూర్తి ప్రదాత అయ్యిందని వారి చరిత్రలు చెబుతున్నాయి.శిరిడీ సాయి కూడా ఒక భక్తునితో “తల్లిని జాగ్రత్తగా చూసుకున్న తర్వాతే తన దర్శనానికి రమ్మని, తల్లి రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలతో సమానం” అని తల్లి గొప్పదనం గురించి అద్భుతంగా చెప్పారు. ఆదిశంకరులు సన్యాసం స్వీకరించిన పిదప కూడా తల్లికి స్వయంగా దహన సంస్కారాలను చేసి మాతృఋణాన్ని తీర్చుకోవల్సిన ఆవశ్యకత గూర్చి తెలియజేసారు.

ఆమ్మను సేవించడం,మంచి చెడులు స్వయంగా చూసుకోవడం భగవంతుని ఆరాధన కంటే మిక్కిలి శ్రేష్టం. కానీ నేటి సమాజంలో తల్లిని దుర్భాషలాడుతూ,వారి యోగ క్షేమాలను విస్మరించి ఆశాశ్వతమైన భోగ భాగ్యాల వెంట పరుగులు తీసే విధ్యాధికులెందరో మనకు కనబడుతున్నారు.పెళ్ళి కాగానే తల్లిని అశ్రద్ధ చేయడం ప్రారంభమవుతోంది. వేరు పడిపోవడం ఆఖరుకు వారి వృధ్యాప్యంలో అనాధల వలే అనాధ శరణాలయాలలో చేర్పించడం జరుగుతోంది. తల్లిని విస్మరించడం, దుర్భాషలాడడం నిష్కృతి లేని మహా పాపం.తల్లిని తృణీకరించి తదనంతరం చేసే పుణ్య కార్యాలకు ఫలితం అతి స్వల్పం.ముందు ముందు అతి హీన జన్మలు తప్పవు. కడుపులో వుండగా కాలితో తంతూ, పెరుగుతూ వుండగా గుండెల మీద తంతూ వున్నా అమ్మ ఎంతో సంతోషంగా భరిస్తుంది. పెద్దయ్యాక హృదయంపై తన్ని వారిని దుఖానికి గురిచేసినా పిల్లల పట్ల అమ్మకు ప్రేమ లవలేశమైనా తగ్గదు. ఎన్ని దాన ధర్మాలు,తపస్సులు,యజ్జ్ఞ యాగాదులను చేసినా తల్లి నింద వలన చుట్టుకునే పాపాలకు నిష్కృతి,పరిహారం కలుగవు. వృధాప్యంలో అండ దండగా నిలిచి, కంటికి రెప్పలా కాపాడుతూ తుది శ్వాస వరకు సంతోషంగా వుంచడం మనిషి జన్మ ఎత్తినందుకు మన కనీస కర్తవ్యం.

Tuesday, March 8, 2011

మీనక్షత్రానికి సంబంధించిన చెట్టు పెంచండి .సర్వ సౌఖ్యాలను పొందండి.

జీవి ఈ భూమ్మీదకు వచ్చేప్పుడు సూర్యుడు ఏనక్షత్రానికి దగ్గరలో వున్నాడో అది మన జన్మ నక్షత్రంగా జ్యోతిష్యశాస్త్రం తెలుపుతుంది. జీవన గమనం లో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెప్పగలిగే దివ్య శాస్త్రము జ్యోతిష్యము. ఇక జీవితములో మనిషికి దు:ఖాన్ని కష్టాలను ఎలాసంభవిస్తాయో వాటికి ఏగ్రహములకు శాంతులు చెయ్యాలో ఈశాస్త్రము లో పరిహారాలు సూచించబడతాయి. దానికనుగుణముగా మనము నక్ష్తర శాంతులు గ్రహ శాంతులు జరిపించుకుంటూంటాము.
మన నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని స్వయంగా పెంచటం ద్వారా దోషాలేమన్నా వుంటె తొలగటమే గాక .సర్వ సౌఖ్యాలను పొందవచ్చు. ఈసూత్రాన్ని ఆచరించి ఎంతో మేలు పొందవచ్చు.మీరు పుట్టిన నక్షత్రానికి దగ్గర సంబంధమ్ గల వృక్షాన్నిపెంచితే అది పెరిగి పెద్దయ్యేకొద్దీ శుభాలను కురిపిస్తుంది మీ జీవితం లో.
మీరునాటవలసిన మొక్కనుగాని లేక ,విత్తనాన్ని గాని మీకు ఎక్కడవీలైతే అక్కడ ,రోడ్లపక్కన వీధి పక్కలన ,పార్కు,కొండ,అడవి దేవాలయం ఇలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ నాటాలి. దానిని పెరిగేలా శ్రద్ద చూపాలి. మీకు నాటాక వాటి పోషణ కు సమయము చాలకుంటే మీస్వతం దబ్బుతో దానిని పెరిగేదాకా సంరక్షించే ఏర్పాటు చేయాలి.మీ నక్షత్రం చూసుకుని ప్రతి నెల ఒక్కసారయినా ఆవృక్షాన్ని దర్శించి నమస్కరించాలి. మీరు నాటిన ప్రదేశానికి సంవత్సరం లో ఒక్కసారైనా వెళ్ళి నమస్కరించి రావాలి. మీగ్రామము లో లేదా నివాస సమీపం లో ఎక్కద ఆవృక్షము కనిపించినా నమస్కరించాలి.ఎట్టి పరిస్థితి లోనూ ఆవృక్షాన్ని దూషించటం గాని నరకటం గాని చేయరాదు.పసిపిల్లలచేత కూడా ఇలా వృక్షాన్ని నాటించిచూడండి వారి జీవితాన శుభాలు వెల్లివిరుస్తాయి. ఇది చదివిన వెంటనే మీ మిత్రులందరికీ తెలియజేయండి. మీరంతా కలసి రోడ్డుపక్కన ఒకప్రదేశములో మీ అందరి నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలను సామూహికంగా పెంచటంద్వారా అందరికీ వేడుకగా వుంటుంది కూడా.

ఏనక్షత్రానికి సంబంధించిన వారు ఏవృక్షం నాటాలి
--------------------------------------
అశ్వని - జీడిమామిడి
భరణి - దేవదారు
కృత్తిక - అత్తి [మేడి]
రోహిణి - నేరేడు
మృగశిర - మారేడు
ఆరుద్ర -చింత
పునర్వసు - గన్నేరు
పుష్యమి - పిప్పలి
ఆశ్లేష - బొప్పాయి
మఖ - మర్రి
పుబ్బ - మోదుగ
ఉత్తర - జువ్వి
హస్త - కుంకుడు
చిత్త - తాడి
స్వాతి - మద్ది
విశాఖ - మొగలి
అనూరాధ - పొగడ
జ్యేష్ఠ - కొబ్బరి
మూల - వేగి
పూర్వాషాఢ - నిమ్మ
ఉత్తరాషాఢ - పనస
శ్రవణం - జిల్లేడు [తెల్లజిల్లేడు మరీ శ్రేష్ఠం]
ధనిష్ఠ - జమ్మి
శతభిషం - అరటి
పూర్వాభద్ర - మామిడి
ఉత్తరాభాద్ర -వేప
రేవతి -విప్ప

Tuesday, March 1, 2011

వాళ్ళ కోసమే..

నెలల పసిపాపల్ని తల్లిపాలకి దూరం చేసి
తెలిసీ తిలియక ముందే క్రష్ ల పాలు చేసి

మనం నిజంగా వాళ్ళ కోసమేనా సంపాదిస్తున్నాం?

అమ్మ కి నాన్న కి మధ్య ఆదమరచి నిద్రపోవాల్సిన వేళ లో
విసుగుతోనొ అలసటతోనో అర్దరాత్రి ఆఫీస్ లోనో ఉండి

మనం నిజంగా వాళ్ళ కోసమేనా సంపాదిస్తున్నాం?

పాలబువ్వలు పెట్టే తీరిక లేక ప్రోసెస్డ్ తిండి అలవాటు చేసి
దాగుడు మూతలాడలేక ప్లే స్కూల్ కి పంపి
ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దించలేక
ట్యూషన్ కని ఉదయపు లేత నిద్రపై నీళ్ళు చల్లి
ఇదంతా చేసి
అమాయకపు బాల్యాన్నంతా దోచేసి

మనం నిజంగా వాళ్ళ కోసమేనా సంపాదిస్తున్నాం?

* Nothing else in this world can be better than a non-working mother అని ఎక్కడో చదివాను. నిజమేనేమో!

చిరునవ్వులతో బ్రతకాలి

ఆత్మీయత కరువైనా అంధకారం ఎదురైనా
బ్రతకడమే బరువైనా స్థితిగతులవి ఏమైనా

చిరునవ్వులతో బ్రతకాలి
చిరంజీవిగా బ్రతకాలి
ఆనందాలను అన్వేషిస్తూ
అందరికోసం బ్రతకాలి
అందరినీ బ్రతికించాలి

బ్రతుకే నీకు బరువైతే ఆ భారం
బరువేదైన గురితో ఓ నలుగురితో పంచుకో
కలతే లేని జీవితమంటే విలువే లేదులే
అలుపే లేక ఎ గేలుపు అవలీలగా రాదులే
నింగినంటు ఎవేర్స్ట్ ఐనా నేల నుండి మొదలవతుంది
నమ్ముకోకు అదృష్టని ..నమ్ముకో ధైర్యాన్ని
మెరుపులే పిడుగులై ఉరుముతున్నా
ఉరకలు వేసే కిరణం జీవితం

చిరునవ్వులతో బ్రతకాలి
చిరుదివ్వెలుగా వెలగాలి
లోకం నిండిన సోకం తుడిచే
వేకువలా ఉదయించాలి
వెన్నెలలే కురిపించాలి

ఎదిగే పక్షి రెక్కకు సహజం ఎగిరే లక్షణం
వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం
ఎది నీది కాదు అనుకో ఎదో నాటికి
ఆయిన రేపు మిగిలే ఉంది ఆశావాదికి
కొమ్మలన్ని చుక్కలవైపే కోరి కోరి చూస్తూ ఉన్న
మట్టితోటి అనుబంధాన్ని చెట్టు మరువగలదా
చీడలే నీడలై వీడకున్న
అందరి బౄందావనమే జీవితం

చిరునవ్వులతో బ్రతకాలి
శ్రీకరంలా బ్రతకాలి
గతమంతా కనుమరుగవుతున్నా
నిన్నటి స్వప్నం నిలవాలి
నీ సంకల్పం గెలవాలి

ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి
ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి
ఆశే నీ లక్ష్యం చెరే ఆస్త్రం మిత్రమా
ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా
ఆశ వెంట ఆచరణ ఉంటే అద్భుతాలు నీ సొంతం
ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం
నిప్పులే గుండెలో నిండుతున్నా
ఉప్పొంగే జలపాతం జీవితం

చిరునవ్వులతో బ్రతకాలి
చిగురాశలతో బ్రతకాలి
అంతిమ విజయం అనివార్యమని
ఆశిస్తూ నువ్వు బ్రతకాలి
ఆశయాన్ని బ్రతికించాలి

నీడె నిన్ను భయపెడితే ఆ నేరం వెలుగుదా
నలుసే నిన్ను భాధపెడితే ఆ దోషం కంటిదా
నేస్తం చూడు జీవితం అంటే నిత్యం సమరమే
సమరంలోనే కనుమూస్తే ఆ మరణం అమరమే
పారిపోకు ఎ ఓటమికి ప్రపంచాన్ని విడిచి
జారిపోకు పాతాళనికి బ్రతుకుబాట మరచి
వరదలా మౄత్యువే తరుముతున్నా
ఆరని అగ్నిజ్వాలే జీవితం

చిరునవులతో బ్రతకాలి
శిఖరంలా పైకి ఎదగాలి
చావుకు చూపే ఆ తెగింపుతో
జీవించాలనుకోవాలి
నువ్వు జీవించే తీరాలి

విజయం తలుపు తెరిచేవరకు విసుగే చెందకు
విసుగే చెంది నిస్పౄహతో నీ వెనుకే చూడకు
చిందే చమట చుక్కకు సైతం ఉంది ఫలితమే
అది అందే వరకు సహనంతో సాగాలి పయనమే
అంతరాత్మ గొంతే నులిమి శాంతి కొరుకుంటవా
అల్లుకున్న అనుబంధాలే తలడిలిపోవా
అలజడే నిలువునా అలుముకున్నా
అలుపెరుగుని చైతన్యం జీవితం ---Seetha ramasastry garu

ఆలోచన-ఆయుధం

కెరటాలపై తేలుతూ, ఆటుపోట్లను ఎదుర్కొంటూ, నీటి మీద నిలదొక్కుకుంటూ, నావ గమ్యం చేరడానికి చుక్కాని మీద నియంత్రణ ఎంత అవసరమో...

మనిషి జీవితంలో కూడా కష్ట, సుఖాలను ఎదుర్కొంటూ, ఆనందడోలికల్లో తేలియాడుతూ గమ్యాన్ని/లక్ష్యాన్నిచేరడానికి "ఆలోచనల" మీద నియంత్రణ కూడా అంతే అవసరం..

మానవ జీవితాన్ని దిశా, నిర్దేశం చేసేది మరియు ముందుకు నడిపే చుక్కాని కూడా "ఆలోచన" లేదా "ఆలోచనల సముదాయమే" .. నా ఈ జీవిత అనుభవాల పరంపరలో నేను నేర్చుకున్న నీతి, తెలుసుకున్న సత్యం "అన్నిటికి మూలం ఆలోచనే" అని.

ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా సాధించాలంటే దాని గురించి ప్రతి క్షణం (లేక ఎక్కువ సేపు) ఆలోచించగలిగితే చాలు..ఖచ్చితంగా అనుకున్నది సాదించగలిగే శక్తీ, యుక్తి తో పాటు అనుకున్నది తొందరగా సాదించటానికి వీలవుతుంది. అది చదువు , ఉద్యోగం , స్నేహం, ప్రేమ, లక్ష్యం కావొచ్చు, మరేదైనా కావొచ్చు... అది ఎంత చిన్నదైన లేక ఎంత పెద్దదైన కావొచ్చు విజయం నీ ముంగిట అనతికాలంలోనే రెక్కలు కట్టుకొని వాలుతుంది.

మానవ జీవితాన్ని అర్ధవంతంగా తీర్చిదిద్దోకోవడానికి కావాల్సిన ఒకే ఒక ఆయుధం "ఆలోచన" ... ఆలోచనలు మంచివైతే నీ పయనం మంచి వైపు...ఆలోచనలు చెడువైతే నీ దారి చెడువైపు...

ఆలోచనలు - మాటలుగా మాటలు - చేతలుగా చేతలు - ఇస్టాలుగా
ఇస్టాలు - అలవాట్లుగా (ఆచరణలు)
అలవాట్లు - స్వభావాలుగా (వ్యక్తిత్వంగా )
స్వభావాలు - తలరాతలుగా పరివర్తన చెందుతాయి..

అంటే ఒక్క నీ ఆలోచనల సమాహారమే నీ జీవితాన్ని నడిపే ఆయుధం... నీ మాటే నీవు సృష్టించుకొనే ప్రపంచం (Word Makes World) ... కావున

చెడు ఆలోచనలను నియంత్రించుకో...
మంచి ఆలోచనలను పెంపోదించుకో...
ఆనందకరమైన పరిసరాలను సృష్టించుకో..
మహోన్నత వ్యక్తిత్వాన్ని అవలంబించుకో..
మంచి సమాజాన్ని సృష్టించుకో..
అందరికి ప్రేమను పంచుతూ..అందరికి సేవ చేసుకొంటూ.. జీవిత లక్ష్యాన్ని చేరుకో...

జీవిత సమరంలో కష్టాల్, సుఖాల్, దుఖాల్ ఏమి ఎదురైనా మొక్కవోని దైర్యంతో, మంచి ఆలోచనలతో లక్ష్యాన్ని చేరుకో... ఈ ప్రపంచాన్ని అంతటా ప్రేమను పంచే ఒక ఆనందకరమైన, ఆహ్లాదకరమైన ఉద్యానవనంగా తీర్చిదిద్దుకో.... ఇందుకు నీ వంతుగా మంచి ఆలోచనలు అభివృద్ధి చేసుకో....


by రఘు