మనం కోరుకున్నవి సాకారమైతే మంచి జరిగిందని, కోరుకోనిదేదైనా తటస్థిస్తే చెడు జరిగిందని అపోహ పడుతుంటాం. ఈ ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా అది మనల్ని ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని జరగదు. అంతెందుకు మన జీవితాన్ని ప్రభావితం చేసేవిగా మనం భావించే పెళ్లి, పిల్లలు పుట్టడం, ఆత్మీయులకు దూరం కావలసి రావడం వంటివన్నీ మనకెంత ముఖ్యమైనవిగా తోస్తాయో 'నేను' అనే వలయాన్ని ఛేధించుకుని ఆవలి నుండి చూస్తే మనతోపాటే ఆయా సంఘ టనల వల్ల ప్రభావితం అయ్యే జీవితాలు ఎన్నో! పెళ్లనేది జరిగితే అది కేవలం ఇద్దరి వ్యక్తులకే పరిమితమైన సంఘటన కాదు. దాన్ని కేంద్రబిందువుగా చేసుకుని ఇరువర్గాల కుటుంబ సభ్యుల్లోనూ అంతర్లీనంగా కొద్ది సర్ధుబాట్లు చోటుచేసుకుంటాయి. ఆ కొత్త దంపతులు, ఆ కొత్త బంధాలు మరిన్ని అనూహ్యమైన సంఘటనలకు దారితీస్తాయి. ఈరోజు మనకు డబ్బు వచ్చిందంటే అది మరొకరి చేతుల నుండి పోబట్టే! ఈ క్షణం మనకు ఎదురైయ్యే ఆనందాలు, విషాదాలు అన్నింటికీ తీగలాగితే వెనుక మనకు తెలియని ఎన్నో అంశాలు చిక్కుముళ్లుగా ముడిపడి ఈ క్షణాన్ని మన కళ్లెదుట నిలుపుతాయి. గతం తాలూకు మేళవింపుగా, భవిష్యత్ తాలూకు నిర్ణయాత్మకశక్తిగా మాత్రమే 'ఈ క్షణం' నిర్మితమై ఉంటుంది. అందుకే ఈ క్షణం మనం అనుకున్నది జరిగినంత మాత్రాన సంతోషించడం, కష్టం కలిగితే కుంగిపోవడం అనాలోచితమైన వ్యక్తీకరణలు.
జీవితం అంటేనే ఓ గొలుసుకట్టు అనుభవాల సమాహారం. ఈ క్షణం మనం ఆస్వాదించేదీ, కుంగదీసేదీ గతం తాలూకు చిహ్నం కావచ్చు, భవిష్యత్‌లో పూర్తి విభిన్నమైన అనుభవాన్ని మిగల్చడానికి ఆదిబిందువు కావచ్చు. అన్నింటికీ మించి ఇప్పుడు తటస్థించిన అనుభవం ఏదైనా కావచ్చు, అది మనకు మాత్రమే మంచి జరిగింది, మనకు మాత్రమే చెడు జరిగింది అని నిర్థారణకు రావడం హాస్యాస్పదమే. మన ప్రమేయం లేకుండా గడిచిపోయే జీవితంలో కేవలం మనం పాత్రధారులం మాత్రమే. మన పనిని చిత్తశుద్ధితో చేసుకుంటూ కర్మయోగిగా ముందుకు సాగాల్సిన వాళ్లమే తప్ప సంఘటనల వెనుక కార్యాకారణ సంబంధాలను అన్వేషించడానికి పూనుకుంటే ఏదో ఒక దశలో ఏ సంఘటన యొక్క ఆద్యంతమూ మనకు ఊహకు అందదు. అలా పూనుకోవడం వృధా ప్రయాసే అవుతుంది. సృష్టి లయబద్ధంగా ఎన్నో జీవితాల్ని ప్రభావితం చేస్తూ తన ధర్మం పాటిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో కొన్ని క్షణాలు కొందరికి సంతోషదాయకమైనవి అయితే మరికొన్ని క్షణాలు మరికొందరికి నిరాశనే మిగుల్చుతాయి. ఈ క్షణం ఇలాగున్నంత మాత్రాన ప్రతీ క్షణమూ ఇలాగే ఉంటుందని నిర్థారణకు రావడం అపరిపక్వమైన ఆలోచనాసరళి! అలాగే ఏది ఎవరికి మంచో, ఎవరికి చెడో తెలుసుకోగలిగిన స్థూలదృష్టి మనకు లేనప్పుడు.. చిత్తశుద్ధిగా మనం చేసేదంతా మంచికే అనుకుని మౌనంగా పనిచేసుకువెళ్లడమే ఉత్తమం.
No comments:
Post a Comment