Friday, February 5, 2010

డబ్బు ప్రాధాన్యత

ప్రతి మనిషికీ ఎన్నో అవసరాలు వుంటాయి. వాటిల్లో చాలా వాటిని డబ్బుతో సమకూర్చుకోవచ్చును. కానీ అన్నీ డబ్బుతో సమకూడవు. ముఖ్యంగా ఆనందం , సంతోషం కేవలం డబ్బుతో సంపాదించలేము. కానీ చాలామంది పొరపాటు అవగాహనతో డబ్బుకు లేనిపోని ప్రాధాన్యతనిచ్చి, దాని సంపాదన కోసం తమకు అనేక రంగాల్లో వున్న ఆసక్తులను, అభిలాషలను చంపుకొని శక్తియుక్తులన్నీ కేంద్రీకరిస్తున్నారు.
ఏ రంగంలో అయినా మనం తీవ్రంగా కృషి చేస్తే ఆ రంగంలో విజయం సాధించటం సహజంగా జరిగేదే. అలా ఒకవేళ విజయం సాధించి డబ్బు సంపాదించినా ఆనందం ,తృప్తిని పొందుతారని గ్యారంటీ ఏం లేదు. అనుకున్నంత సంపాదించి దానితో అన్నిరకాల సౌకర్యాలూ సమకూర్చుకునీ కూడా పొందామనుకున్న ఆనందాన్ని ఎక్కువకాలం నిలబెట్టుకోలేరు. చాలా త్వరగానే మామూలైపోతారు. మళ్ళీ పరుగు , క్రొత్తకోరికలు తీర్చుకోవటం కోసం. ఎక్కువ సంపాదిస్తే , జీవితాన్ని మరింత సుఖమయంగా మార్చుకోవచ్చుననుకుంటారు కానీ కరెక్ట్ మాత్రం కాదు. కడుపు కాలుతున్నపుడు సంపాదించిన 10 రూపాయలకి ఇచ్చే విలువ, కడుపు నిండినతరువాత సంపాదించే ఏ పది రూపాయలకీ ఉండదు. ఇది అందరికీ అనుభవమే. అసలు ఆనందం అనేది బయట ఎక్కడో లేదు. నిజంగా ఆనందంగా వుండేవాడికి డబ్బుతోనూ, సౌకర్యాలతోనూ పనేలేదు.

ఇక్కడ ఒక చిన్న కధ.

తీరికదొరికిన కోటీశ్వరుడైన వ్యాపారి ఒకడు తీరం వెంట వెళుతున్నాడు. అక్కడ ఒక జాలరి వలను ప్రక్కనబెట్టి చెట్టుక్రింద హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. సంతోషంగా కూనిరాగాలు తీస్తున్నాడు.జాలరి అంత సంతోషంగా ఉండటం చూసిన వ్యాపారికి అతనితో మట్లాడాలనిపించింది.దగ్గరికి పోయి మాట కలిపాడు . వారిమధ్య సంభాషణ ఇలా సాగింది.

వ్యాపారి:ఏమోయ్ ఏ రోజేం పనిలేదా?

జాలరి :చేపలు పట్టడం , అమ్మటం అయిపోయిందండి. పని అయిపోయిందిగదాని విశ్రాంతి తీసుకుంటున్నాను. వ్యాపారి: పని అయిపోవటం ఏమిటి? ఇంకా చేపలు పట్టవచ్చుకదా?
జాలరి : ఇంకాఎందుకండీ?

వ్యాపారి: ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు కదా?

జాలరి : ఇంకా సంపాదించి ఏం చేయాలండీ?

వ్యాపారి: ఏంచేయాలి అంటావేం పిచ్చివాడా? స్వంతంగా పడవ కొనుక్కోవచ్చు. ఇంకా మనుషులను పెట్టుకొని, ఇంకా ఎక్కువ చేపలు పట్టవచ్చు.ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు.
జాలరి : అప్పుడు?

వ్యాపారి: ఇల్లు కొనుక్కోవచ్చు.

జాలరి : తర్వాత?

వ్యాపారి: ఇంకా సంపాదించి, టివి, కారు, ఫ్రిజ్ వగైరా కొనుక్కోవచ్చు.
జాలరి : అప్పుడేమవుతుంది? వ్యాపారి: నువ్వు ఆనందంగా , సంతోషంగా జీవించవచ్చు.
జాలరి : అలాగా! అయితే ఇపుడు నేను చేస్తున్నదేమిటండీ? ఇపుడు నేను ఆనందంగానే వున్నాను కదా? అవన్నీ చేయకపోతే నేను సంతోషంగా వుండనని మీ ఉద్దేశ్యమా? వ్యాపారి నిర్ఘాంతపోయాడు.
మనకి ఎన్ని హంగులు, ఆర్భాటాలు, సౌకర్యాలు వున్నాయన్న దానిమీద మనసంతోషం అధారపడదు. పై కధ చదివింతర్వాత ఇదేదో అభివృధ్ధికి వ్యతిరేకం , సోమరివాళ్ళకి అనుకూలం అనుకోవచ్చు. అలా అర్ధం చేసుకోకూడదు. అభివృధ్ధి అవసరమే. కాని అది ఎవరికి? ఎంతవరకు? అనేది ఎవరికి వారు విజ్ణతతో తెలుసుకోవలసిన విషయం. అందరికీ అన్నీ అవసరం కావు. మనిషి మనిషికీ ప్రాధామ్యాలూ ,అవసరాలూ మారుతూ వుంటాయి. "ఆలశ్యం అమృతం విషం" అనిచెప్పిన పెద్దలే "నిదానమే ప్రధానం" అని కూడా చెప్పారు. రెండూ పరస్పర విరుధ్ధంగావుంటాయి. రెండూ కరెక్టే కాని ఎవరికి వారు ఏ ఏ సందర్భాల్లో వీటిని అన్వయించుకోవచ్చు అనేది వారి వారి విచక్షణని బట్టి వుంటుంది. డబ్బు సంపాదన విషయం కూడా అంతే.

అసలు మంచి సంగీతం వింటూ ఆనందించటానికీ, ప్రకృతి అందాలని ఆస్వాదించటానికీ, భార్యాపిల్లలతో సంతోషంగా గడపటానికీ, ఇష్టమైనపుస్తకం చదువుతూ ఆనందించటానికీ డబ్బుతో పనేముందీ?

అంతా మన మంచికే

కొన్ని సంఘటనలలో మన పొరపాట్లు లేకపోయినా, మనసుని పాడుచేసే సందర్భాలు ఎదుర్కోవలసి రావటం అనేది ఎవరికైనా అనుభవమే.
రోజువారీ కార్యక్రమాలలో అనుభవమయ్యే కష్ట నష్టాలు, అవమానాలు, కలతలు, నలతలూ మన మనసులను అప్పుడప్పుడు పాడు చేయటం సహజంగా జరుగుతూనే వుంటుంది. కాని వాటిని వేటికవి విడదీసి చూసుకుని సంకుచితంగా విశ్లేషించుకుని బాధపడటం తప్పు. అలా చిన్న చిన్న వాటికి అతిగా స్పందించటం మాని, ఇంకా పైస్థాయి నుంచి వాటిని అవగాహన చేసుకుంటూ, వాటి పరమార్ధం ఏమైవుండవచ్చో గ్రహిస్తూ, వాటి వలన జరుగబోయే మంచిని అంచనా వేయాలి. అలా ముందుకు సాగాలి.
గతంలో మనల్ని బాధపెట్టిన అనేక సందర్భాలను గుర్తు తెచ్చుకుంటే వాటివలన తదనంతర కాలంలో మనకు జరిగిన మంచి, మనలో వచ్చిన మంచిమార్పులు ఎవరైనా గుర్తించవచ్చు. మనం ఎదుర్కొనే కష్టాలు, అపజయాలు మనలను మరింత బలంగా తయారు చేస్తాయి.
ఇంకా చెప్పాలంటే ఈ పరిస్థితులన్నీ గతంలో మనం చేసిన పనుల ఫలితాలే. మనం అనుభవించక తప్పదు. మనం గుర్తుంచుకోవలసిన మరో ముఖ్య విషయం "జరిగిందంతా మంచే, జరగుతున్నదీ మంచే, జరుగబోయేది మంచే".

కష్టాలన్నీ మంచివారికేనా

మామూలుగా మనకు సామాన్యులు ,చెడ్డవాళ్ళు ఏదో పద్దతిలో సంతోషంగానే ఉన్నట్లు కనిపిస్తారు .కాని మనం మంచివాళ్ళు ,నీతిమంతులు అని చెప్పుకునే కొందరు ఎక్కువ కష్టాలు పడుతూ కనపడుతుంటారు . ఎందుకని ? ఇది నిజమేనా ? మన అపోహా ? నాకైతే నిజమే అనిపిస్తుంది.
ఎందుకంటే, ఈ ఆధ్యాత్మికవాదులూ , మంచివాళ్ళూ, మామూలు విషయాలకు ఫ్రాధాన్యం ఇవ్వరు. వాళ్ళ దృష్టి అంతా శాశ్వతానందం మీదా, అలౌకిక విషయాలమీదా వుంటుంది. అందుకనే వీరు ప్రాపంచిక విషయాలలో (సామాన్యులకువలే ఆస్తులూ, సౌకర్యాలూ వగైరా సమకూర్చుకోవటం లో) లౌక్యంగా వ్యవహరించడం మీద శ్రద్ద చూపరు. అందుచేతనే దైనందిన వ్యవహారాల్లో ను, వివిధ సామాన్య విషయాల్లోను వీరు వెనకపడి పోతూ వుంటారు.తద్వారా కష్టాలు తెచ్చుకుంటారు. ఇది మనం అంగీకరించాలి.
ఒక మంచివాడు, చెడ్దవాడు పేకాటో, చదరంగమో ఆడుతున్నారనుకోండి. ఎవరు గెలుస్తారు ?నిస్సందేహంగా ఆట ఎవరికి బాగా వచ్చో వాడే గెలుస్తాడు. మంచివాడే గెలవాలి చెడ్దవాడు వోడిపోవాలంటే కుదరదు మరి . మంచివాడైనా మహాత్ముడైనా తను పాల్గొనే ఆట ఎలా ఆడాలో తెలియకపోతే ఓడిపోక తప్పదు. ఆట గెలవటానికీ, అతని మంచితనానికీ సంబంధమే లేదు.
ఇంతకూ బయట నుంచి చూసే మనం , వారు పొందుతున్నారనుకొంటున్న కష్టం అంత తీవ్రంగాను తమలోతాము వాళ్ళూ పొందుతారా? అని. ఏ మాత్రం పొందరు. ఎందుకంటే. ఇలాంటి చిన్న చిన్న కష్టాలు, వైఫల్యాలు, నష్టాలు వారినేమీ చేయలేవు.వారు విజయాలకు పొంగి పోరు, ఓటములకు కృంగిపోరు.కారణం వారి దృష్టి ఇంకా ఉన్నత స్థాయిలో ఉంటుంది కాబట్టి.

ప్రతీ మనిషీ నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయాలు.

1. ఏదో ఒక రోజున నాకు అనారోగ్యం కలుగుతుంది. దాన్ని నేను తప్పించుకోలేను.
2. ఏదో ఒక రోజున నాకు వృద్ధాప్యం వస్తుంది. దాన్ని నేను తప్పించుకోలేను.
3. ఏదో ఒక రోజున నన్ను మృత్యువు కబళిస్తుంది .దాన్ని నేను తప్పించుకోలేను.
4. నేను అమితంగా ప్రేమించి, నావి అని భావించే వస్తువులు , సంపద , ఆస్థి అన్నీ ఏదో ఒక రోజున మార్పుకు, నాశనానికి, లేదా ఎడబాటుకు లోనయ్యేవే . దాన్ని నేను తప్పించుకోలేను.
5. నేను చేసిన పనుల [ స్వకర్మల ] పలితంవల్లే నేను ఇలా తయారయ్యను . నా పనులు ఎటువంటివైనా, మంచివైనా చెడువైనా - వాటీకి నేను వారసుణ్ణి కావలసిందే.

అనారోగ్యాన్ని గుర్తుంచుకోవటం ద్వారా ఆరోగ్యం వలన కలిగే అహంకారాన్నీ, వృద్ధాప్యాన్ని గుర్తుంచుకోవటం ద్వారా యవ్వనం వలన కలిగే అహంకారాన్ని, మృత్యువును ధ్యానించటం ద్వారా జీవన విధానం వలన కలిగే అహంకారాన్ని, ప్రతి వస్తువులో కలిగే మార్పునీ, నాశనాన్ని ధ్యానించటంద్వారా, అన్నీ నాకే కావాలనే బలమైన కోరికను అణిచివేయవచ్చు లేదా కనీసం తగ్గించవచ్చు .మనం చేసే పనుల ఫలితాన్నే మనం అనుభవిస్తామన్న సత్యాన్ని మననం చేసుకోవటం ద్వారా ఆలోచనలలో, మాటలలో, పనులలో చెడు చేయాలనే దుర్మార్గ స్వభావం అణగారుతుంది. కనీసం తగ్గుతుంది.

Wednesday, February 3, 2010

ముందు మనం మారాలి!

Reply |Raghuram.Perla@ubs.com to me
show details Feb 3 (1 day ago)
మనకు ఎంతసేపూ బయట మురికి కనిపిస్తుంది. కాని మన లోని మురికి కనిపించదు. మనకు బయట శుభ్రంగా వుంటే బాగుంటుందనిపిస్తుంది, కాని మనలోని మురికి తొలగించుకుని మనం కూడా శుభ్రంగా ఉండాలనుకోం. మనం ఎదుట వారు శుభ్రంగా అందంగా వుండాలని, కనబడాలని ఎలా కోరుకుంటామో, మనం కూడా అలాగే ఉండాలని, కనబడాలని ఎదుట వారు కోరుకుంటారు. అందుచేత ఎదుట వారి దోషాలు ఎంచేటపుడు ముందు మనలో ఉన్న దోషాలు చూసుకోవాలి. ఎదుట వారిలో దోషాలు తొలగాలనుకునే ముందు మనలో దోషాలు తొలగించుకోవటానికి ప్రయత్నించాలి.
మనం ఏది కోరుకుంటామో ఇతరులు మన నుండి అదే కోరుకుంటారని తెలుసుకోవాలి. మనం ఇతరుల నుండి ప్రేమ, ఆప్యాయత, మర్యాద, మన్నన, వినయం, అభిమానం, సహాయం కోరుకుంటే మన నుండి ఇతరులు కూడా అవే కోరుకుంటారని తెలుసుకోవాలి.
మనల్ని ఎవరు అవమానించకూడదని, హేళన చేయకూడదని, చులకనగా చూడకూడదని, మోసగించకూడదని, హింసించకూడదని, బాధించకూడదని అనుకుంటే మనం కూడా ఎవరినీ అవమానించకూడదు, హేళన చేయకూడదు, మోసగించకూడదు, బాధించకూడదు.
ఎదుటి వారు మారాలనుకునే ముందు మనం మారటానికి ప్రయత్నించాలి. మనం లోకాన్నించి ఏది ఆశించినా ముందు అది లోకానికి ఇవ్వడానికి ప్రయత్నించాలి. మనం మారకుండా లోకం మారదు. లోకానికి ఇవ్వకుండా లోకం నుండి మనకు ఏదీ రాదు. అంతా మనలోనే ఉంది. మన జీవితంలో జరిగేవన్నీ మనమే తయారు చేసుకుంటున్నాము. అందుచేత మన జీవితం గురించి మనల్ని మనమే నిందించుకోవాలి. ఇంకొకర్ని నిందించి ప్రయోజనం లేదు.
అందుచేత ముందుగా మన గురించి మనం ఆలోచించాలి. మనల్ని మనం సరి చేసుకోవటానికి ప్రయత్నించాలి. మనలోని గుణాలు, దోషాలు తొలగించుకోవటానికి ప్రయత్నించాలి. మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. మనం శుద్ధులవుతే అంతా శుద్ధిగానే కనబడుతుంది. మనలో ఏ దోషమైతే ఉందో అదే ఇతరులలోనూ, లోకంలోనూ కనబడుతుంది. మనలో ఏ పొరపాట్లు ఉన్నాయో అవే ఇతరులలోనూ కనబడుతాయి.
పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. అందుచేత మనం ముందుగా దోష రహితులు కావాలి. మనలోని పొరపాట్లు సరిచేసుకోవాలి. మనల్ని మనం మార్చుకున్న రోజున అన్నీ మారినట్లే. అందుచేత "ముందు మనం మారాలి". లోపమేక్కడో లేదు. మనలోనే వుంది. మనలో లోపం తెలియాలన్నా, మనం మారాలన్నా ధ్యానమొక్కటే మార్గం.

ప్రక్క వాడిలో చూడవలసినది ఏంది?

చూడవలసింది శారీరక అందం కాదు- మాటల అందం, ఆలోచనల అందం, పనుల అందం, గుణాల అందం, అలవాట్ల అందం.
చూడవలసింది బాహ్య సౌందర్యం కాదు- అంతర్ సౌందర్యం.
చూడవలసింది భోగ విషయాలు కాదు- దైవ విషయాలు.
చూడవలసింది భుక్తే కాదు- ముక్తి కూడా.
చూడవలసింది మన ఇల్లు బాగుండటం కాదు- మన మనసు బాగుండటం.
చూడవలసింది ధన వృద్ధి కాదు- జ్ఞాన వృద్ధి.
చూడవలసింది వస్తు సముపార్జన కాదు- జ్ఞాన సముపార్జన.
చూడవలసింది సంపదలు కాదు- జ్ఞాన సంపద.
చూడవలసింది రూపం కాదు- గుణం.
చూడవలసింది దేహాభిమానం కాదు- ఆత్మాభిమానం.
చూడవలసింది దేహ చింతన కాదు- దేహి చింతన.
చూడవలసింది దేహాన్ని కాదు- ఆత్మను.
చూడవలసింది శారీరక సుఖాన్ని కాదు- ఆత్మానందాన్ని.
చూడవలసింది భౌతికం కాదు- ఆధ్యాత్మికం.
చూడవలసింది బాహ్య ప్రియం కాదు- భావ ప్రియం.
చూడవలసింది సుఖకరమైనవి కాదు- శ్రేయస్కరమైనవి.
చూడవలసింది వయస్సులో వృద్ధులను కాదు- జ్ఞానం లో వృద్ధులను.
చూడవలసింది సంసార సుఖం కాదు- శాశ్వత సుఖం.
చూడవలసింది చచ్చిపుట్టే జీవితం కాదు- చావు పుట్టుకలు లేని జీవితం.
చూడవలసింది శారీరక శుద్ధి కాదు- మాటల శుద్ధి, భావ శుద్ధి.
చూడవలసింది ఏమి చేస్తున్నామో కాదు- ఎలా చేస్తున్నామో.
చూడవలసింది ఏమి మాట్లాడుతున్నామో కాదు- ఎలా మాట్లాడుతున్నామో.
చూడవలసింది ఇతరుల మెప్పు కాదు- భగవంతుని మెప్పు.
చూడవలసింది ఇతరులలో దోషాలు కాదు- మనలో దోషాలు.
చూడవలసింది మానసిక తృప్తి ని కాదు- బ్రహ్మానందాన్ని.
చూడవలసింది తానూ తరించతమే కాదు- అందరు తరించాలని.
చూడవలసింది తన సంసారం బాగుండాలని కాదు- అందరు బాగుండాలని.
చూడవలసింది శత్రు నాశనం కాదు- అంతర్ శత్రు నాశనం.
చూడవలసింది శిష్య గణాన్ని కాదు- చెప్పే బోధలు.
చూడవలసింది పేరు ప్రఖ్యాతులు కాదు- వచ్చిన పని సాధించటం.
చూడవలసింది మహత్యాలు కాదు- వారు చెప్పే బోధలు ఆచరిస్తున్నామా అని.
చూడవలసింది బాగా మాట్లాడటం కాదు- చెప్పేది ఆచరించడం.
చూడవలసింది చదువును కాదు- సంస్కారాన్ని.
చూడవలసింది కామిగా కాదు- మోక్షగామి గా.
చూడవలసింది అధికారంలో ఉన్నత స్థితిని కాదు- జ్ఞానం లో ఉన్నత స్థితిని .
చూడవలసింది పాండిత్యం కాదు- ఆత్మ జ్ఞానం.
చూడవలసింది సౌఖ్యాన్ని కాదు- ధ్యాన సాధనని
చూడవలసింది ఎంత పెద్ద సౌధం నిర్మించాడా అని కాదు- ఎంత పెద్ద జ్ఞాన సౌధం నిర్మించాడా అని.
చూడవలసింది సంపదలు పెంచుకున్నాడా అని కాదు- జ్ఞాన సంపద పెంచుకున్నాడా అని.
చూడవలసింది లేని దాన్ని కాదు- సత్యాన్ని.
చూడవలసింది శరీరాన్ని కాదు- నీ నిజ రూపాన్ని.
చూడవలసింది తాత్కాలికం కాదు- శాశ్వతం.
చూడవలసింది నశించిపోయేదాన్ని కాదు- నశింపు లేని దాన్ని.
చూడవలసింది కళ్ళకు కనబడేదాన్ని కాదు- కనబడని దాన్ని.
చూడవలసింది తాత్కాలిక సుఖాన్ని కాదు- శాశ్వత శాంతిని.
చూడవలసింది ప్రాపంచిక విషయాలు కాదు- ఆధ్యాత్మిక విషయాలు.
చూడవలసింది అతని వద్ద ఏమి వుండి అని కాదు- అతను ఏ స్థితి లో ఉన్నాడు అని.
చూడవలసింది అజ్ఞానమనే చీకటిని కాదు- జ్ఞానమనే వెలుగును.
చూడవలసింది ఉండని దాన్ని కాదు- ఉండేదాన్ని.
చూడవలసింది 'మేను'ను కాదు- మేను లోని 'నేను' ను.

నా జీవితం లోనివి కష్టాలు కాదు, భగవంతుని వరాలు!

నేను శక్తిని అడిగాను - భగవంతుడు నాకు కష్టాన్ని ఇచ్చి శక్తిని పొందమన్నాడు.
నేను సంపదను అడిగాను - భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు.
నేను ధైర్యాన్ని అడిగాను - భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు.
నేను వరాలు అడిగాను - భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు.
నేను ఆయన ప్రేమను అడిగాను- భగవంతుడు ఆపదల్లో ఉన్నవారి చెంతకు నన్ను పంపించాడు.
నేను జ్ఞానాన్ని అడిగాను - భగవంతుడు నాకు సమస్యల్ని ఇచ్చి పరిష్కరించమన్నాడు.
నేను పురోగతి అడిగాను - భగవంతుడు నాకు అవరోధాలు కల్పించి సాధించమన్నాడు.
నేను లోకానికి మంచి చెయ్యాలని అడిగాను - భగవంతుడు ఇబ్బందులు కల్పించి అధిగమించమన్నాడు.
నేను ఆయన్ను మరువకూడదు అని అడిగాను - భగవంతుడు భాధలు ఇచ్చి ఆయన్ను గుర్తుంచుకోమన్నాడు.
నేను పాపాలు క్షమించమని అడిగాను - భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు.
అలా జీవితం లో నేను కోరుకున్నదేదీ పొందలేదు - నాకు కావలసిందే నేను పొందాను.
ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతీ సంఘటననుండి నాకు అవసరమైనది పొందటం నేను నేర్చుకున్నాను. చివరకు ఏది జరిగినా నా మంచికే అని అర్ధం చేసుకున్నాను. మీరు కూడా అర్ధం చేసుకోండి. జరిగేది అంతా మన మంచికే.