ఓ ఆడపిల్ల కష్టాల గురించి చెప్పాలన్నా, రాయాలన్నా ప్రపంచంలోని ప్రతివాడు తగుదునమ్మా అని సిద్ధపడిపోవటమే. అక్కడికేదో కష్టం ఆడపిల్ల సొత్తు అన్నట్లు, ఆ కష్టాల పుట్టుపూర్వోత్తరాలన్నీ వీళ్ళకే తెలిసినట్లు. ఆదివారం పూట పొద్దున్నే కాస్త ఆనందిద్దాం అని టీవీ నొక్కటం ఆలస్యం .. కళంకిత, అకళంకిత, అలౌకికత, అవివేకిత, అన్వేషిత, అన్వేషించనిత, అన్వేషిస్తున్నత, విధివంచిత, అంతరంగాలు, బహిరంగాలు, స్త్రీ, వనిత, మగువ, ఆడది ఓరి వీళ్ళ సీరియళ్ళు దొంగలు ఎత్తుకెళ్ళిపోను, తెలుగు డిక్షనరీలో ఆడ అన్న ప్రతి పదంతోనూ ఓ సీరియల్ తీసి పారేసారు. ఏమిటి అసలేమిటి జరుగుతోందిక్కడ? మగాళ్ళకి కష్టాలే లేవా? ఏనాటికి అలౌకికుడు, విధివంచితుడు, కళంకితుడు లాంటి సినిమాలు, సీరియళ్ళు వస్తాయో ఆ రోజే మగాడు పడుతున్న కష్టాలకి గుర్తింపు.
అసలు మగపిల్లాడిగా పుట్టి పెరగటం ఎంత కష్టమో ఈ పురుషద్వేషులకి ఏం తెలుసంట?
పుట్టి నాలుగడుగులు వెయ్యటమే లేటు, మొగపిల్లవాడికి సిగ్గేమిటంటూ చిన్ని గోచీ గుడ్డ కట్టి ఊరిమీదకి వొదిలేసిన హృదయవిదారక దృశ్యం ఎంతమందికి తెలుసని నేనడుగుతున్నా? అసలు ఇది కూడా (గోచీ) పెట్టి పుట్టిన వాడికి, లేకపోతే మొండిమొలతో ఊళ్ళేలాల్సిందే. ఎంత మగ వెధవయినంత మాత్రాన ఇంత పక్షపాతమా? గుడ్డముక్క వాడి ఒంటికి బరువా? ఆ సీను ఫోటో తీసి పెద్దయ్యేదాకా దాచి, ఎదురింటి మీనాకి, పక్కింటి ప్రియకి చూపించి కొద్దోగొప్పో కష్టపడి అన్నేళ్ళుగా పోగేసుకున్న సిగ్గుని పూర్తిగా తీసేసిగానీ నిద్రపోరు ఈ అమ్మలక్కలు.
అమ్మాయి పుడితే మహాలక్ష్మి అంటారు, అదే అబ్బాయి పుడితే కుబేరుడు అనరు, కుబేరుడి దగ్గర అప్పులపాలయిన శ్రీనివాసుడు అంటారు. ఎంత దారుణం?
స్కూల్లో చేరాక కళంకిత, అకళంకిత, అలౌకికత, అవివేకిత, అన్వేషిత, అన్వేషించనిత, అన్వేషిస్తున్నత, విధివంచితనీ మాత్రం మేస్టారు అరచేతిలో ముద్దుపెట్టినట్లు సుతిమెత్తగా కొట్టి, మగవెధవలంటూ అలౌకికుడు, విధివంచితుడు, కళంకితుడులను అరచేయి వెనక్కి తిప్పి వేళ్ళిరిగేలా స్కేలుతో కొడతాడు. విధించే శిక్షలోనూ అన్యాయమే.
కాలేజీకెళ్ళటానికని సిటీ బస్సు ఎక్కి కూర్చుంటే, అక్కడ కూర్చోనే సీట్లని కూడా ఆడపిల్లలకి రిజర్వు చేసి, వాళ్ళు రాగానే సీట్లు ఇచ్చి, వాళ్ళముందే నిలబడి ప్రయాణం చేసిన రోజుల్ని ఎలా మరిచిపోగలం? బస్సు సీట్ల రిజర్వేషన్ అంటే యాదుకొచ్చింది, మంద కృష్ణ అన్నకి ఈ అయిడియా వస్తే, ఆర్టీసీ బస్సుల్లో కూచొనే సీట్లకి కూడా రిజర్వేషను అమలు చేస్తే, సీటు కోసం బస్సు ఎక్కటం అంత బుద్ధి తక్కువ ఇంకోటి ఉండదు. ఎవరూ ఈ సీక్రెట్ లీకు చెయ్యకండి ప్లీజ్...
ప్రతి మగాడి విజయం వెనకాల ఓ ఆడది ఉంటుందిట, కానీ ప్రతి ఆడదాని విజయం వెనకాల ఓ మగవాడు ఉంటాడు అని కోట్ ఎవరయినా చెపితే విన్నారా? క్రెడిట్ ఇవ్వకపోగా భరించువాడు భర్త అని ఓ దిక్కుమాలిన టైటిలు పడేసి భరించలేనంతగా బాధపెట్టేదెవరు?
ఏ రకంగా చూసినా మగ పిల్లాడి మెయింటెనెన్సు ఖర్చు తక్కువ. చొక్కా, లాగు, పాంటు, షర్టు. చిన్ని జుట్టు, చింపిరి జుట్టూ, నెలరోజులుగా మడ్డిపట్టిన ప్యాంటు కూడా ఫ్యాషను అని చెప్పి గడిపెయ్యగలరే పాపం.
ఉద్యోగం చెయ్యని ఆడపిల్ల గృహలక్ష్మి, కానీ ఉద్యోగం చెయ్యని మగవాడు గృహపురుషుడు కాదు కదా అసలు పురుషుడు కింద లెక్క కాదట. ఎందుకంటే ఉద్యోగమే పురుష లక్షణమట. మరి ఉద్యోగం చెయ్యకపోతే స్త్రీ లక్షణము అవ్వాలి కదా. అంటే గృహలక్ష్మిలా గృహనారాయణుడు అవ్వాలి న్యాయంగా. కానీ జరుగుతున్నదేమిటి. ఉద్యోగం లేని పురుషుడి బతుకు ... అమ్మో.. ఎంత దారుణం చూసారా?
ఆడపిల్లని ఇంప్రెస్స్ చెయ్యటానికి మగ పిల్లలు పడే కష్టాలు ఎన్నెన్ని? ఎన్ని చీవాట్లు, ఎన్ని చెంప దెబ్బలు, ఎన్నెన్ని చె..దెబ్బలు. అసలు ఆడ పిల్లలు అలా మగ పిల్లల్ని ఇంప్రెస్ చేసే కష్టాలు పడతారా? అని నేను అడుగుతున్నాను.
సెలవంటూ వస్తే ఇంటిపట్టునే ఉండకుండా రోడ్లమీద పడి తిరుగుతూ రాత్రికి ఇంటికి చేరుకునే మగ పిల్లలతో ఎంత ఆదా?
నడిపే డ్రైవరు మగే అయినా, మగాళ్ళు చెయ్యూపితే ఇంకా స్పీడుగా పోయే సిటీ బస్సుడ్రైవరు గాడు అదే ఆడ పిల్లలు ఎక్కడ చెయ్యూపితే అక్కడే ఆపుతాడు, జాతి ద్రోహి.
పోనీ మా హీరో సినిమా చూట్టానికి మరో ఇద్దరు పురుగుల్ని ఎనక రమ్మని టిక్కట్టు కోసం వెళితే అక్కడ ఇంకో జాతి ద్రోహి. మగాళ్ళకి తలకొకటి, ఆడోళ్ళకి తలకి రెండు టిక్కట్లుట. ఎందుకీ అసమానత ఓరీ జాతిద్రోహీ అని వాళ్ళముందే నిలదీసా. బాగా కాలినట్లుంది. మనకు ఒక బాడీకి ఒక బుర్ర తెలివే ఉంటుంది, వాళ్ళు ఒక్కొక్కరికీ రెండు బుర్రల తెలివి ఉంటుంది, అందుకని రెండు టిక్కట్లని అని ఎదవ సిగ్గు లేకుండా సెటైరేసాడు. తర్వాత తెలిసింది, వాడి పెళ్ళాం అదే షో చూట్టానికొచ్చి లోపల వాడి పక్కనే నుంచుందని.
బోర్డు లేని లేడీస్ స్పెషల్ బస్సులోకి రన్నింగ్ లో పొరపాటున ఎక్కి, ఎన్నో క్రూరమైన చూపుల తాకిడికి జింకపిల్లలా భయపడుతూ లోపలికి వెళ్ళలేక, పోనీ తెలియక బస్సెక్కాడన్న జాలి కూడా లేకుండా మరింత స్పీడుగా బస్సు పోనిచ్చే మరో జాతిద్రోహి వల్ల కిందకి దిగలేక, ఫుట్ బోర్డుపై ఆ మగ ప్రాణి అనుభవించే చిత్రవ్యధ ఎవరికి తెలుసు?
లేడీస్ స్పెషల్ బస్సులు, బోగీలు, లేడీసు స్పెషలు ఎగ్జిబిషన్... మరి మగాళ్ళకో?
No comments:
Post a Comment