Tuesday, April 26, 2011

నాన్నా ఇవే నీకు నా పుట్టిన రోజు శుభాకాంక్షలు...!

నాన్నా ఇవే నీకు నా పుట్టిన రోజు శుభాకాంక్షలు...!

అమ్మకు ఆరో ప్రాణం నేను, నాకు పంచ ప్రాణాలు నీవు...
అల్లరి చేసే నన్ను అదిలించేది అమ్మైతే ఆత్మీయంగా కొమ్ముకాచేది నీవు...

తప్పటడుగు వేసే నన్ను గొప్పగా నడిపించే పాదం నీవు...
నిప్పుల ఉప్పెనలో నేచిక్కుకుంటే చల్లని చినుకల్లే చేరి చల్లార్చేది నీవు...

అడుగకనే అన్నీ ఇచ్చే నన్ను కన్న అద్భుత ద్వీపం నీవు...
కలత చెందిన క్షణాన నేచెప్పకనే తప్పులనెంచి సరిదిద్దే గురువు నీవు...

కల్మషంలేని పియూష ప్రేమ పంచే తల్లికి సరి జోడు నీవు...
జన్మ జన్మలకు మరపురాని అనురాగాలాపన చేసే గంధర్వుడవు నీవు...

ఉలిక్కి పడి నేభయపడితే నన్ను చేరే ధైర్య సాహసానివి నీవు...
జననికి ఐదో తనం నీవు, ప్రాణ కోటి మనుగడకు సృష్టి ప్రధాతవు నీవు...

విసురుగా కసురుతూ అక్కున చేర్చుకొనే అభయ హస్తం నీవు...
దిక్కు తోచని తికమకలో నేనుంటే సన్మార్గాన్ని చూపే మార్గదర్శివి నీవు...

ఓటమిలో నేకృంగిపోతే, ఆత్మ విశ్వాసాన్ని నింపే కాలం నీవు...
గెలుపులో నేపొంగిపోతే, గర్వాన్ని అణిచే అభినందన బృందావనం నీవు...

ఎన్నెన్నో జన్మల బంధం నేడు నీలా మారి నన్ను చేరి నిలువు...
ఎన్నని చూపగలను నీ కీర్తి శిఖరాల్ని, అవి అంతంలేని త్యాగాల నెలవు...

ఏన్ని పదాలతో నిన్ను కీర్తించినా ఇంకనూ నీ విలువలు కలవు...
ఏమని చెప్పగలను నీ స్పూర్తి సుగుణాల్ని, అవి వెలలేని వజ్రాల కొలువు...

శిలను శిల్పంగా మలచే ఉలి పుట్టిన రోజు సంబరాలకు సెలవు...
ఆజన్మాంతం మా కోసం కరిగే దీపానికి శుభాకాంక్షలు తెలుపగా కాదేదీ సులువు...!

No comments:

Post a Comment