Saturday, May 7, 2011

భక్తి కన్నా గొప్పది ..సంకల్పం

భక్తి కన్నా గొప్పది ..సంకల్పం

ఓ మిత్రమా... నా హృదయాన నిలిచిన మైత్రీ బంధమా...
నీ మంచి కోరి ఒక మంచి మాట చెప్పదలుచుకున్నాను...

నీ హృదయంలో దాగి ఉన్న భయానికి అభయాన్ని ఇవ్వాలనుకున్నాను...
చెప్పినంత సులువు కాదు చయడం కాని అసాధ్యం కుడా కాదని తెలుసుకో...

అనుకున్న కార్యం అయ్యేవరకు విశ్రమించకు.. పట్టువదలకు...
చెప్పుడు మాటలు వినుట తప్పు అన్నారు కదా అని...

పెద్దలు చెప్పు మాటలు పెడచెవిన పెట్టుట ఇంకా పెద్ద తప్పు...
మనసు చెప్పిన మాటలు అణిచివేయుట తప్పులకే పెద్ద తప్పు...

మంచి అన్నది గరళంలా చేదుగా ఉంటుంది కాని...
అది ప్రసాదించే ఫలితం అమృతంలా తీయగా ఉంటుంది...

నీ మనసు నిర్మలమైనదైతే అది ఎల్లప్పుడూ మంచినే సూచిస్తుంది...
నిన్ను పూర్తిగా అర్ధంచేసుకోనేది అమ్మ తరవాత నీ మనసు ఒక్కటే...

నీ మీద వల్లమాలిన ప్రేమతో అమ్మ తప్పుగా సూచించవచ్చేమో కాని...
మనసు మాత్రం కఠినమైన బాధ కలిగినా మంచినే సూచిస్తుంది...

నీ మనసు మాట వింటే నిన్ను నువ్వు జయించిన వాడివౌతావు...
నీ ఆలోచనల బాటలు అడుగులు పయనిస్తే లక్ష్యాన్ని చేరగలవు...

జయాపజయాలు నీ మీద ఎలాంటి ప్రభావము చూపలేవు...
నీ మనసుకు నచ్చిన పనిని చేసాననే తృప్తి వంద విజయాలతో సమానం...

నీ గమ్యం చేరే మార్గంలో ఎవ్వరినీ పూర్తిగా నమ్మకు నిన్ను తప్ప...
ఎవ్వరి మీద ఆధారపడకు నీ ఆత్మవిశ్వాసంతో నడిచే సామర్ధ్యం మీద తప్ప...

చివరి వరకు శక్తివంచన లేకుండా పోరాడటం మన వంతు...
విజయమో వీరస్వర్గమో దేనినైనా ప్రసాదించడం దేవుని వంతు...

ప్రయత్నించి విఫలమవ్వడం తప్పు కాదు కాని...
ప్రయత్నించడానికే విఫలమవ్వడం మన్నించలేని మహాపరాధం...

నిన్ను నువ్వు నమ్ముకో... ఆ దైవం నీ తోడుగా నిలుస్తుంది...
నీ నీడగా కడవరకు కలిసి నడుస్తుంది.. నీకు విలువనిస్తుంది...

అదే సంకల్పానికి ఉన్న శక్తి... అది మనలో ఉన్న భక్తి కన్నా గొప్పది...
అదే నమ్మకానికి ఉన్న కీర్తి... అది దేవునిలో ఉన్న ముక్తి కన్నా గొప్పది...

No comments:

Post a Comment