Sunday, March 20, 2011

అమ్మంటె

అమ్మంటె..

ఒక చాదస్తం..
జాగర్త జాగర్త అని పది సార్లు ఎందుకు..
నాకు తెల్వదా...

ఒక నస..
పొంగనే ఫోన్ చెయ్యిరా..
నేను పొయ్యేసరికే ఏదో అర్దరాత్రి అయితది.. పొద్దున చేస్తలే..

ఒక గోల..
తిన్నవారా..
ఎందుకడుగుతవ్ అన్ని సార్ల, తిన్నవా తిన్నవా అని..
నాకు తెల్వదా యేలకు తినాలని..

ఒక అమాయకత్వం..
ఎమొర గయన్ని నాకేం తెలుస్తయ్ కొడుకా..నువ్వయితె అంత మంచే కద..
ఇగ యేం తెలుస్తయమ్మ నీకు.. టీవీ కూడ సూస్తలెవ్వా..

ఒక సెంటిమెంటల్ ఫూల్..
వారానికొక్కసారే కదరా...
గా పిచ్చి పిచ్చి సీరియల్లు పెట్టి దిమాగ్ ఖరాబ్ చెయ్యకమ్మా..

ఒక ఫూల్..
ఔనా.. నా దగ్గర రెండు వేలున్నయిరా తీస్కొ మరి..
మా అమ్మని కొంచెం ప్రేమగ అడుగుతే ఎమన్న ఇస్తది..
శునకానందం..

ఒక లోకం తెల్వని పిచ్చిది..
అంత దూరం దేషం కాని దేషంల ఎట్లుంటవ్ కొడుకా..
గివన్ని చేశి, గింత కష్టపడి తీరా గిప్పుడు వీసా అచ్చినంక గిట్లంటవేందమ్మా, నీకెం అర్దం అయితది నా కష్టం ..

ఒక అతి జాగ్రత్త..
అన్ని సర్దుకున్నవా..పేపర్లు మంచిగ సూస్కో..
అబ్బా... ఎన్ని సార్లు చూస్కోవాల్నమ్మా..

మూఢ భక్తి..
అరె ఆగుర ..ఆగుర.. బొట్టు పెడ్త.. నా కోసం కొద్దిగ దేవునికి మొక్కి పోర..
నీకు తెలుసు కదమ్మ నేను నాస్తికున్నని.. మల్ల నన్నెందుకు బలవంత పెడ్తవ్..

ఇంతల నా ఫోనె మోగింది..
"అంతేనా...ఇంకేం కావాలి.. "
బొమ్మరిల్లు రింగ్ టోన్..
హాయ్ బంగారూ..
అవతల నా ప్రియురాలు..
అక్కడ కూడా అదే చాదస్తం..
దాన్ని బుజ్జగించి మరీ బయలుదేరానెందుకో..
ఎందుకో తట్టలేదు..


ఏరో ప్లేన్ ఎక్కినంక..
నేను నా దోస్తులు..
నేను నా ప్రియురాలు..
నేను నా తమ్ముడూ..
నేను నా కాలేజీ మజాలు..
నేను నా తండ్రి..
ఒక అరగంటయ్యింది..

అమ్మ ఎక్కడో మాయమయ్యింది..

నా లోపల ఇంకోక ఆత్మ ఉందేమో..
కోమాలో ఉందేమో...
అది చెప్పింది..
నువ్వూ నీ తండ్రీ
ఆనందంగ గడిపిన సమయంలో
నీ తల్లి నీకోసం వంటింట్లో సమాధయ్యిందేమో..
నీ కోసం..
ఒక సారి గుర్తు తెచ్చుకో..
మెల్లగా కళ్ళ నీళ్ళు తిరిగాయి...

నువ్వూ నీ తమ్ముడూ, నువ్వూ నీ నేస్తాలు..
నీకో వంద మంది మనుషులూ, సరదాలు, వ్యాపకాలు..
అమ్మ వ్యాపకాలేమి గుర్తు తెచ్చుకో..
నువ్వు తిరిగొచ్చే లోపల నీకిష్టమయ్యింది వండిపెట్టడం అమ్మ వ్యాపకం..

జాగర్త అని నస పెడుతుండి అమ్మ కదా..
ఆ జాగర్తే లేకుంటే నువ్వు ఇంత వాడివయ్యేవా..
నీకు రోగం అస్తె నీకు జాగర్తగ సేవ చెయ్యకుంటె,
ఇప్పుడు కనీసం బతికే వాడివా

పోంగనే ఫోన్ చేసుడే నీకు కష్టమాయే..
నీ ఫోన్ కోసం తెల్లందాంక నిద్ర పోని నీ అమ్మ కష్టాన్ని యేమనాలె..

తిన్నవా అని ఎందుకడుగుతవ్ పది సార్ల..
నువ్వు అడిగినవా ఆమె తిన్నదో లేదోనని..ఆమె తింటె కాదు
నువ్వు తిన్నవంటెనే ఆమె కడుపు నిండేది తెలుసా నీకు..


ఆమెకి యేం తెల్వది పిచ్చిది కదా..
నువ్వు బయటకు పొయ్యి లోకం చూస్తె..
ఆమె నిన్ను చూస్కున్నది మరి ఆ సమయం ల..

భోలా మనిషి కదా..
తెలివిగ బోల్త కొట్టించచ్చు..
మరి ఆమె చీర నీ వాక్మనుగా మారిందనే సత్యం తెలుసా నీకు..

నస పెడుతుంది అమ్మ కదా..
పైసలు ఎల్లక మీ ఇంట్ల మీ నాన పనిమనిషిని మానిపిస్తే మరి మీ అమ్మ కాళ్ళ నొప్పులు యేమయినయ్ అడుగలేదే ఒక్క సారి కుడ..

నువ్వా దిక్కుమాలిన దేశం పోతే నిన్ను ఆమెలెక్క సూస్కునేటోల్లు లేరని యేద్షింది గని నీ అబివ్రుద్దికి ఆటంకం కాదే..

దేవునికి ఒక్కసారి మొక్కుడె కష్టమాయే..
రోజు ఆమె మొక్కేది నువ్వు సల్లంగుండాలెనని తెలుసురా నీకు..

ఆమె యేడ్షిందే తెలుసు నీకు గని..
అది నీకోసమని తెల్వదా...
అప్పటికి అయిదు గంటలయ్యింది..
నా కన్నీళ్ళాగుతలెవ్వు...
మనసంత ఒకే మంత్రం..
అమ్మా అమ్మా అని..

ఎప్పుడు దిగుతానా ..
ఎప్పుడు అమ్మతో
మాట్లాడుదామా ...
యేడుస్తునే ఉన్నా...
ఎయిర్ హోస్టెస్ వచ్చి
విషయం కనుక్కుని వెల్లిపొయింది...
మా అమ్మ కాదుగా నా కన్నీల్లు తుడవగ..
ప్రయాణం ముగిసింది..
మాట్లాడాను..
ఎక్కడొ ..
ఇంకా అహంభావం..

ఆరు నెలల తరవాత..
నాన కాల్ లో ఓ సారి..
మీ అమ్మ నిద్రలో
కలవరిస్తుందిరా నీ పేరు..
అప్పుడప్పుడు
పక్క తడిమి చూసుకుంటుంది
నువ్వున్నావేమో అని..
తరవాత మట్లడతా..
ఉంటా నాన్నా..
నాకా శక్తి లేదు..
తట్టుకునేంత..

రెండు సంవత్సరాల తరవాత..
నిలుచున్నా
ఇంటి ముందర...
ఎవ్వరికి తెల్వది
నేనున్ననని..
గోడ దూకా..
నాకు తెలుసు
తాళం ఎక్కడుంటుందో..

అమ్మ
పొద్దున లేచింది..
నానా నువ్వేనా..
అమ్మ ఊహకందలేదు..
ఆష్చర్యమో..
ఆనందమో..
కలో నిజమో..
అమెరికాల కొడుకు
పొద్దున కల లో ..
కాని
కలలా లేని కలవరం..
అమ్మ యేడుస్తూనే ఉంది
నన్ను కావలించుకుని..
నసలాగ లేదు..
చాదస్తం కాదు..
ఎందుకంటే
చూసుకునే సరికి
నేనూ యేడుస్తున్నా డామిట్..
గంట పట్టింది
ఇంట్లో అంతా తేరుకునే సరికి..
పిచ్చి అమ్మ..
మనసులో అనుకున్న..
అమ్మ పిచ్చిది
యేం తెలుసు అమ్మకి..
యేం తెల్వది..
తెల్లారి డైమండ్ రింగ్ ఇచ్చా..
నాకెందుకు నానా ఇవన్నీ అంది..
"నువ్వింటికచ్చి
నా కల నిజం చేసినవ్
అదే కోటి వజ్రాల పెట్టు అన్నది.."
పిచ్చి ప్రేమ..
అమ్మ మొహంల ప్రషాంతత..
లవ్ యూ మా..
నా మనసు కేరింతలు కొట్టింది
అమ్మంటే ?
ఒక కేరింత..
ఒక పులకరింత.. oka friend rasadu...Chaitu

No comments:

Post a Comment