మాతృమూర్తికి తొలి వందనం
మాతృదేవోభవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిధి దేవోభవ అనే వేదోక్తిలో తల్లికే అగ్ర తాంబూలం ఇచ్చింది మన వేదం. హిందూ ధర్మంలోనే కాక అన్ని మతాలలో కూడా మాతృమూర్తికే తొలి వందనం అర్పించాలని ప్రవచించాయి. ప్రేమ, దయ,కరుణ,త్యాగాలలో మాతృమూర్తికి సాటి మరి ఎవరూ లేరు. ఆన్ని జీవుల హృదయాలలో అంతర్యామిగా కొలువు వుండే ఆ భగవంతుడు కళ్ళెదుట కనిపించే తన ప్రతిరూపం కూడా వుండాలన్న ఆలోచనతో మాతృమూర్తిని మనకు అందించాడు. అందుకే కనిపించని ఆ దైవానికి సజీవ ప్రతిరూపం “అమ్మ”. ఆ పేరులోనే ఎంత కమ్మదనం వుందో వర్ణింప శక్యం కాదు.
భార్యా భర్తల పవిత్ర సృష్టి కార్యం తర్వాత జీవుడు మాతృ గర్భంలో ప్రాణం పోసుకుంటాడు. నాటి నుండి అనుక్షణం పెరగడానికి అనువైన వాతావరణం తల్లి గర్భంలో సహజంగా రూపుదిద్దుకుంటుంది. తల్లి గర్భమే ఆ జీవునికి ప్రపంచం. తొమ్మిది మాసాల పాటు తల్లి ఆ శిశువును ఎంతో సంతోషంతో మోస్తుంది. శిశువు ఆరోగ్యంగా జన్మించాలని ఇష్టం వున్నా లేకున్నా ఎక్కువ మరియు అయిష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తుంది. మృత్యు సమానమైన ప్రసవ వేదనను ఎంతో సంతోషంతో భరిస్తుంది. ఛివరకు మరణానికి కూడా సిద్ధమై శిశువుకు ప్రాణం పోస్తుంది. అందుకే ప్రసవం అనేది అమ్మకు పునర్జన్మ అని అంటారు.ఆ క్షణం నుండి శిశువు సంరక్షణలో సర్వం మరిచిపోతుంది. తాను కన్నీళ్ళు ద్రిగమింగుకొని అమృతం వంటి స్తన్యాన్ని బిడ్డకు అందిస్తుంది. నిద్రాహారాలను మాని పిల్లల సంరక్షణే జీవితాశయంగా జీవించే అమ్మ ప్రేమను కొలిచే పరికరం ఏదీ లేదు.అమ్మ పవిత్ర ప్రేమకు,దయకు సాటి వేరొకటి లేదు. అందుకే భగవంతుడు తాను అమ్మ తర్వాతే పూజ్యనీయుడనని స్పష్టంగా చెప్పాడు.
బిడ్డ ఎదుగుతుంటే శ్వేతపత్రం వంటి మనసుపై ప్రపంచ జ్ఞానాన్ని ముద్రించే గురుతర బాధ్యతను మాతృమూర్తి స్వీకరిస్తుంది. అందుకే తల్లికే తొలి వందనం. తల్లియే తొలి గురువు. బిడ్డ మాటలు వచ్చాక పలికే తొలి పలుకు “అమ్మ”. పుట్టిన నాటి నుండి పాలతో పాటు విషయ పరిజ్ఞానాన్ని,లోక జ్ఞానాన్ని పంచి ఇస్తుంది.అందుకే పిల్లలందరూ ప్రపంచాన్ని తల్లి ద్వారా చూస్తారని అంటారు. తల్లి చీర కొంగు పట్టుకొని తొలి అడుగు వేస్తాడు బిడ్డ. తల్లి ప్రక్కనే వుంటే ఈ ప్రపంచాన్నే జయించగలమన్న ఆత్మ స్థైర్యం వారిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.ఏది తప్పో – ఏది ఒప్పో కూడా తల్లి ద్వారానే నేర్చుకుంటాడు. అందుకే మహాత్మా గాంధీజి, చత్రపతి శివాజీ, స్వామి వివేకానంద వంటి మహనీయులందరికీ తల్లియే స్పూర్తి ప్రదాత అయ్యిందని వారి చరిత్రలు చెబుతున్నాయి.శిరిడీ సాయి కూడా ఒక భక్తునితో “తల్లిని జాగ్రత్తగా చూసుకున్న తర్వాతే తన దర్శనానికి రమ్మని, తల్లి రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలతో సమానం” అని తల్లి గొప్పదనం గురించి అద్భుతంగా చెప్పారు. ఆదిశంకరులు సన్యాసం స్వీకరించిన పిదప కూడా తల్లికి స్వయంగా దహన సంస్కారాలను చేసి మాతృఋణాన్ని తీర్చుకోవల్సిన ఆవశ్యకత గూర్చి తెలియజేసారు.
ఆమ్మను సేవించడం,మంచి చెడులు స్వయంగా చూసుకోవడం భగవంతుని ఆరాధన కంటే మిక్కిలి శ్రేష్టం. కానీ నేటి సమాజంలో తల్లిని దుర్భాషలాడుతూ,వారి యోగ క్షేమాలను విస్మరించి ఆశాశ్వతమైన భోగ భాగ్యాల వెంట పరుగులు తీసే విధ్యాధికులెందరో మనకు కనబడుతున్నారు.పెళ్ళి కాగానే తల్లిని అశ్రద్ధ చేయడం ప్రారంభమవుతోంది. వేరు పడిపోవడం ఆఖరుకు వారి వృధ్యాప్యంలో అనాధల వలే అనాధ శరణాలయాలలో చేర్పించడం జరుగుతోంది. తల్లిని విస్మరించడం, దుర్భాషలాడడం నిష్కృతి లేని మహా పాపం.తల్లిని తృణీకరించి తదనంతరం చేసే పుణ్య కార్యాలకు ఫలితం అతి స్వల్పం.ముందు ముందు అతి హీన జన్మలు తప్పవు. కడుపులో వుండగా కాలితో తంతూ, పెరుగుతూ వుండగా గుండెల మీద తంతూ వున్నా అమ్మ ఎంతో సంతోషంగా భరిస్తుంది. పెద్దయ్యాక హృదయంపై తన్ని వారిని దుఖానికి గురిచేసినా పిల్లల పట్ల అమ్మకు ప్రేమ లవలేశమైనా తగ్గదు. ఎన్ని దాన ధర్మాలు,తపస్సులు,యజ్జ్ఞ యాగాదులను చేసినా తల్లి నింద వలన చుట్టుకునే పాపాలకు నిష్కృతి,పరిహారం కలుగవు. వృధాప్యంలో అండ దండగా నిలిచి, కంటికి రెప్పలా కాపాడుతూ తుది శ్వాస వరకు సంతోషంగా వుంచడం మనిషి జన్మ ఎత్తినందుకు మన కనీస కర్తవ్యం.
No comments:
Post a Comment