Monday, January 27, 2020

గాలిపటం చెప్పే జీవితసత్యం

జీవిత సత్యం.

తండ్రీ కొడుకులు మేడపైకి ఎక్కి గాలిపటం ఎగరేస్తున్నారు. గాలిపటాన్ని ఎలా ఎగరేయాలో తండ్రి పిల్లవాడికి నేర్పిస్తున్నాడు. గాలిపటం బాగా ఎత్తుకు, వెళ్ళాక దారాన్ని కొడుకు చేతికి అందించాడు తండ్రి.

కొడుకు ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆ వెలుగులో తండ్రి మనసు ఉప్పొంగిపోయింది. కొంతసేపు దారాన్ని చేత్తోపట్టుకున్నాక కొడుకు తండ్రిని అడిగాడు.

"నాన్నా దారంతో పట్టి ఉంచితేనే గాలిపటం అంత ఎత్తుకి ఎగిరిందే! దారాన్ని తెంపేస్తే ఇంకా ఎత్తుకు
ఎగిరిపోతుంది కదా" అన్నాడు.
తండ్రి నవ్వాడు. "దారాన్ని తెంపేద్దామా మరి?" అని అడిగాడు. "తెంపేద్దాం నాన్నా" అన్నాడు కొడుకు ఎంతో ఉత్సాహంగా.

ఇద్దరూ కలిసి దారాన్ని తెంపేశారు.
"టప్' మని దారం తెగిపోగానే గాలిపటం ఇంకా పైకి ఎగిరిపోయింది. అంతలోనే దారి తప్పి అటూ ఇటూ కొట్టుకుంటూ కిందికి పడిపోవడం మొదలుపెట్టింది! చివరికి ఎవరి మేడ మీదనో కూలిపోయింది.

"ఇలా జరిగింది ఏంటి నాన్నా" అన్నాడు కొడుకు విచారంగా,
దారం తెంపేస్తే గాలిపటం ఇంకా ఇంకా పైకి పోతుందనుకుంటే, కిందికొచ్చి పడిపోవడం ఆపిల్లాడికి నిరుత్సాహం కలిగించింది. తండ్రివైపు బిక్కమొహం వేసుకుని చూశాడు.

కొడుకును దగ్గరికి తీసుకున్నాడు తండ్రి. "గాలిపటానికి దారం ఉండేది. దానిని ఎగిరిపోనీయకుండా పట్టి ఉంచేందుకు కాదు. గాలి ఎక్కువైనా, తక్కువైనా గాలిపటం తట్టుకుని నిలబడి, ఇంకా ఇంకా పైపైకి ఎగిరేలా చేసేందుకే" అని చెప్పాడు. మరో గాలిపటానికి దారం కట్టి ఎగరేసి కొడుకు చేతికి దారం అందించాడు.

జీవితంలో కూడా మనకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. కుటుంబం అనే బంధం లేకపోయి ఉంటే మనం ఇంకా ఏదో సాధించి ఉండేవాళ్లం అని .నిజానికి కుటుంబం అందించిన ప్రేమ, సేవ, సౌకర్యాల వల్లనే మనం ఈ మాత్రమైనా నిలబడి ఉన్నామని గ్రహించాలి.

 కుటుంబం మనల్ని పట్టుకుని లేదు. పట్టుకుని ఉందనుకుని వదిలించుకునే ప్రయత్నం చేస్తే మనమే పట్టుతప్పిపోతాం. తెగిపోయిన గాలిపటంలా గింగిరాలు తిరుగుతూ ఎక్కడో పడిపోతాం.

1 comment:

  1. Nijam chepparu Raghu. Family thodu jeevinthatham adhugay uthasaham isthundhi. Family prema lo adho theliyani santhosham untundhi aa santhosham yantha sampadhinchina raadhu.

    ReplyDelete