ప్రతి మనిషికీ ఎన్నో అవసరాలు వుంటాయి. వాటిల్లో చాలా వాటిని డబ్బుతో సమకూర్చుకోవచ్చును. కానీ అన్నీ డబ్బుతో సమకూడవు. ముఖ్యంగా ఆనందం , సంతోషం కేవలం డబ్బుతో సంపాదించలేము. కానీ చాలామంది పొరపాటు అవగాహనతో డబ్బుకు లేనిపోని ప్రాధాన్యతనిచ్చి, దాని సంపాదన కోసం తమకు అనేక రంగాల్లో వున్న ఆసక్తులను, అభిలాషలను చంపుకొని శక్తియుక్తులన్నీ కేంద్రీకరిస్తున్నారు.
ఏ రంగంలో అయినా మనం తీవ్రంగా కృషి చేస్తే ఆ రంగంలో విజయం సాధించటం సహజంగా జరిగేదే. అలా ఒకవేళ విజయం సాధించి డబ్బు సంపాదించినా ఆనందం ,తృప్తిని పొందుతారని గ్యారంటీ ఏం లేదు. అనుకున్నంత సంపాదించి దానితో అన్నిరకాల సౌకర్యాలూ సమకూర్చుకునీ కూడా పొందామనుకున్న ఆనందాన్ని ఎక్కువకాలం నిలబెట్టుకోలేరు. చాలా త్వరగానే మామూలైపోతారు. మళ్ళీ పరుగు , క్రొత్తకోరికలు తీర్చుకోవటం కోసం. ఎక్కువ సంపాదిస్తే , జీవితాన్ని మరింత సుఖమయంగా మార్చుకోవచ్చుననుకుంటారు కానీ కరెక్ట్ మాత్రం కాదు. కడుపు కాలుతున్నపుడు సంపాదించిన 10 రూపాయలకి ఇచ్చే విలువ, కడుపు నిండినతరువాత సంపాదించే ఏ పది రూపాయలకీ ఉండదు. ఇది అందరికీ అనుభవమే. అసలు ఆనందం అనేది బయట ఎక్కడో లేదు. నిజంగా ఆనందంగా వుండేవాడికి డబ్బుతోనూ, సౌకర్యాలతోనూ పనేలేదు.
ఇక్కడ ఒక చిన్న కధ.
తీరికదొరికిన కోటీశ్వరుడైన వ్యాపారి ఒకడు తీరం వెంట వెళుతున్నాడు. అక్కడ ఒక జాలరి వలను ప్రక్కనబెట్టి చెట్టుక్రింద హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. సంతోషంగా కూనిరాగాలు తీస్తున్నాడు.జాలరి అంత సంతోషంగా ఉండటం చూసిన వ్యాపారికి అతనితో మట్లాడాలనిపించింది.దగ్గరికి పోయి మాట కలిపాడు . వారిమధ్య సంభాషణ ఇలా సాగింది.
వ్యాపారి:ఏమోయ్ ఏ రోజేం పనిలేదా?
జాలరి :చేపలు పట్టడం , అమ్మటం అయిపోయిందండి. పని అయిపోయిందిగదాని విశ్రాంతి తీసుకుంటున్నాను. వ్యాపారి: పని అయిపోవటం ఏమిటి? ఇంకా చేపలు పట్టవచ్చుకదా?
జాలరి : ఇంకాఎందుకండీ?
వ్యాపారి: ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు కదా?
జాలరి : ఇంకా సంపాదించి ఏం చేయాలండీ?
వ్యాపారి: ఏంచేయాలి అంటావేం పిచ్చివాడా? స్వంతంగా పడవ కొనుక్కోవచ్చు. ఇంకా మనుషులను పెట్టుకొని, ఇంకా ఎక్కువ చేపలు పట్టవచ్చు.ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు.
జాలరి : అప్పుడు?
వ్యాపారి: ఇల్లు కొనుక్కోవచ్చు.
జాలరి : తర్వాత?
వ్యాపారి: ఇంకా సంపాదించి, టివి, కారు, ఫ్రిజ్ వగైరా కొనుక్కోవచ్చు.
జాలరి : అప్పుడేమవుతుంది? వ్యాపారి: నువ్వు ఆనందంగా , సంతోషంగా జీవించవచ్చు.
జాలరి : అలాగా! అయితే ఇపుడు నేను చేస్తున్నదేమిటండీ? ఇపుడు నేను ఆనందంగానే వున్నాను కదా? అవన్నీ చేయకపోతే నేను సంతోషంగా వుండనని మీ ఉద్దేశ్యమా? వ్యాపారి నిర్ఘాంతపోయాడు.
మనకి ఎన్ని హంగులు, ఆర్భాటాలు, సౌకర్యాలు వున్నాయన్న దానిమీద మనసంతోషం అధారపడదు. పై కధ చదివింతర్వాత ఇదేదో అభివృధ్ధికి వ్యతిరేకం , సోమరివాళ్ళకి అనుకూలం అనుకోవచ్చు. అలా అర్ధం చేసుకోకూడదు. అభివృధ్ధి అవసరమే. కాని అది ఎవరికి? ఎంతవరకు? అనేది ఎవరికి వారు విజ్ణతతో తెలుసుకోవలసిన విషయం. అందరికీ అన్నీ అవసరం కావు. మనిషి మనిషికీ ప్రాధామ్యాలూ ,అవసరాలూ మారుతూ వుంటాయి. "ఆలశ్యం అమృతం విషం" అనిచెప్పిన పెద్దలే "నిదానమే ప్రధానం" అని కూడా చెప్పారు. రెండూ పరస్పర విరుధ్ధంగావుంటాయి. రెండూ కరెక్టే కాని ఎవరికి వారు ఏ ఏ సందర్భాల్లో వీటిని అన్వయించుకోవచ్చు అనేది వారి వారి విచక్షణని బట్టి వుంటుంది. డబ్బు సంపాదన విషయం కూడా అంతే.
అసలు మంచి సంగీతం వింటూ ఆనందించటానికీ, ప్రకృతి అందాలని ఆస్వాదించటానికీ, భార్యాపిల్లలతో సంతోషంగా గడపటానికీ, ఇష్టమైనపుస్తకం చదువుతూ ఆనందించటానికీ డబ్బుతో పనేముందీ?
No comments:
Post a Comment