Monday, September 30, 2024

ఒక చిన్న కథ

*ఒక చిన్న కథ*

ఒక వ్యక్తి పామును కాల్చి చంపడం చూసి దానిని మంట నుండి బయటకు తీయాలని నిర్ణయించుకున్నాడు.అలా చేయగానే పాము కాటేసింది.కాటు బాధాకరమైన నొప్పిని కలిగించింది, ఆ చేతి దాక వచ్చిన పాము మళ్ళీ మంటల్లో పడిపోయింది.ఆ వ్యక్తి దాన్ని బయటకు తీయడానికి మళ్లీ మళ్లీ ప్రయత్నించాడు.

*ఇదంతా ఇంకో వ్యక్తి గమనిస్తు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు:*

నన్ను క్షమించండి..కానీ మీరు పామును మంటలో నుండి బయటకు తీయడానికి ప్రయత్నించిన ప్రతిసారీ అది మిమ్మల్ని కాటేస్తుందని మీకు అర్థం కాలేదా? ఎందుకు మొండిగా ఉన్నారు?
*అప్పుడు ఆ వ్యక్తి ఇలా జవాబిచ్చాడు:*
పాము యొక్క స్వభావం కాటువేయడం,కానీ అది కాటువేస్తుంది కదా అని నా స్వభావం మారిపోదుకదా..అని జవాబిచ్చి పక్కనే ఉన్న ఓ కర్ర సహాయంతో ఆ పామును మంటల్లోంచి బయటకు తీసి ప్రాణాలను కాపాడెడు...కాబట్టి ఎవరైనా మీకు హాని చేసినంత మాత్రాన మీ స్వభావాన్ని మార్చుకోకండి.మీ సారాన్ని కోల్పోకండి,జాగ్రత్తలు మాత్రమే తీసుకోండి.మీ ప్రతిష్ట కంటే మీ మనస్సాక్షి గురించి ఎక్కువగా చింతించండి.మీ మనస్సాక్షి అంటే మీరు మరియు మీ కీర్తి..కేవలం ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అని మీ స్వభావం మారుతుందో అప్పుడు మీ ఉనికే ఉండదు..ఏమి చేసిన పైన దేవుడనే వాడు చూస్తూ ఉంటాడు..నువ్వు ఏం చేసినా అంతకు అంతా ఇచ్చే తీరుతాడు కాబట్టి కర్మ చేయి ప్రతిఫలం ఆశించకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


2)నువ్వు మంచి చేస్తే నీకే తిరిగివస్తుంది☺

అర్జునుడు, కృష్ణుడు ఒకసారి రాజ్యంలో ఊర్లు, ప్రజలు ఎలా ఉన్నారో చూసి వద్దాం అని బయలుదేరారు. దారిలో ఒక పేద పూజారి బిచ్చమెత్తుకోవటం చూసారు. అర్జునుడికి అతన్ని చూసి బాధ అనిపించి ఒక 100 నాణాల మూట అతనికి ఇచ్చి, ఈ ధనంతో హాయిగా బతుకు, ఇక మళ్ళీ బిచ్చం అడగద్దు, అని అతనికి చెప్పాడు. ఆ మూట తీసుకుని పూజారి ఆనందంగా ఇంటికి వెళుతుంటే దారిలో ఎవరికో సాయం అవసరం అని అర్ధం అయ్యింది. అయినా చూసీ చూడనట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇంకో పది అడుగులు వేసాడో లేడో, ఒక దొంగ అతన్ని బెదిరించి మూట దొంగిలించుకుని పోయాడు. పూజారి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళాడు. 

మరుసటిరోజు మళ్ళీ బిచ్చం అడక్క తప్పలేదు ఆయనకి. అర్జునుడు కృష్ణుడు మళ్ళీ అతన్ని చూసి, ఏమిటిది, అని అడగితే, అంతా వివరించి చెప్పాడు పూజారి. వెంటనే అర్జునుడు ఒక వజ్రాన్ని అతనికి ఇచ్చి, ఈ సారి జాగ్రత్తగా ఉండమన్నాడు. 

పూజారి వజ్రంతో ఇంటికి వెళుతుండగా, మళ్ళీ ఎవరికో సాయం అవసరం అనిపించింది, ఒక నిముషం ఆలోచించాడు సాయం చేద్దామని, వజ్రాన్ని డబ్బుగా మార్చనిదే తానే తినలేడు, ఇంక వారికేమి సాయపడగలను ఇప్పటికిప్పుడు అనుకుని తన ఇంటికే వెళ్ళి ఓ కుండలో ఆ వజ్రం దాచి, అలసటగా అనిపిస్తే, ఓ కునుకు వేసాడు. అతను ఇంటికి వచ్చేటప్పటికి అతని భార్య ఇంట్లో లేదు. అతను పడుకున్నప్పుడు ఇంటికొచ్చిన భార్య, మంచి నీళ్ళు తెద్దామని కుండ తీసుకుని నదికి వెళ్ళింది, కుండలో వజ్రం సంగతి ఆవిడకి తెలియదాయే. నదికి వెళ్ళి పై పై నీరు ని పక్కకి తోసి కుండని నీళ్ళల్లో ముంచి కుండ నిండా నీళ్ళు పట్టింది. ఆ నీటి ప్రవాహంలో వజ్రం కొట్టుకుపోయింది. ఇంటికి వెళ్ళగానే అప్పటికే నిద్ర లేచి కుండని, వజ్రాన్ని వెతుక్కుంటున్న పూజారి, భార్య చేతిలో కుండ చూసి, వజ్రం తీసావా అని అడిగాడు. ఏ వజ్రం, ఏమిటి అని ఆవిడ ఎదురు ప్రశ్నించేసరికి, పూజారికి తల గిర్రున తిరిగింది, నా దురదృష్టం ఇంత బలమైందా, ఏదీ కలిసి రావట్లేదు అనుకుని బాధ పడ్డాడు. 

మళ్ళీ మరునాడు బిచ్చం ఎత్తుకుంటుంటే అర్జునుడికి విషయం తెలిసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు అవతారపురుషుడు కృష్ణయ్య చిద్విలాసంగా చిరునవ్వు నవ్వుతూ, పూజారి భుజాన్ని ధైర్యాన్ని ఇస్తున్నట్టు మెల్లగా తట్టి, ఒక నాణెం చేతిలో పెట్టాడు. ఆ నాణేంకి ఒక్క పూట అన్నం కూడా రాదు. అది తెలిసీ ఏమీ మాట్లాడలేక పూజారి ఇంటి దారి పట్టాడు. అర్జునుడికి ఏమి అర్ధం కాలేదు, కృష్ణుడు నాతో రా అంటూ అర్జునుణ్ణి తీసుకుని పూజారి వెనకే వెళ్తున్నారు. దారిలో ఒక జాలరి తన వలలో పడ్డ ఒక్క చేపని గిలగిలా కొట్టుకుంటుంటే చూస్తున్నాడు. పూజారి ఆ చేప జీవన్మరణ యాతన చూడలేక, తన దగ్గరున్న ఆ ఒక్క నాణానికి ఎలానూ ఏమీ రాదు, కనీసం చేప ప్రాణాన్ని నిలుపుదాం అని ఆ నాణానికి చేపను జాలరి దగ్గర నుంచి తీసుకుని తన దగ్గర ఎప్పుడూ ఉండే మంచినీళ్ళ పాత్రలోని నీళ్ళల్లో చేపను వేసాడు. కొంచేం సేపటికి గొంతుకకి అడ్డం పడ్డ వజ్రాన్ని బయటకి తోసేసి చేప చచ్చిపోయింది. అది చూసిన పూజారి పట్టలేని ఆశ్చర్యంతో గట్టిగా అరిచాడు, దొరికింది దొరికింది అని. అక్కడే అప్పుడే అటుగా వచ్చిన దొంగ తనని చూసి గుర్తు పట్టి పూజారి అరుస్తున్నాడేమో అనుకుని, ఎక్కడ రాజభటులకి పట్టిస్తాడో అనే భయంతో, పూజారి దగ్గరికి పరుగున వచ్చి, తాను దోంగిలించిన 100 నాణాల మూట పూజారి చేతికి ఇచ్చి పారిపోయాడు. 

పూజారికి కాసేపు ఏమీ అర్ధం కాలేదు. అంతా వింతలా ఉంది. ఇదంతా చూస్తున్న అర్జునుడు కృష్ణుడితో, అర్ధమయ్యిందిలే నీ ఆట, అన్నాడు. 

ఎప్పుడైనా మనకి ఉన్నదానిలోనే, అవసరం ఉన్న వారికి ఎంతోకొంత సాయం చేస్తే, ఆ సాయం ఏదో రూపేణా తిరిగి మనకే, మనకి సాయం అవసరమయినప్పుడు అందివస్తుంది., ఆపద్బాంధవి అవుతుంది.

No comments:

Post a Comment