Monday, June 30, 2025

కోల్పోయిన

ఏదైనా కోల్పోయిన తరువాతే దాని విలువ తెలుస్తుంది.
ఇది మన జీవితంలో ఎన్నోసార్లు ఎదురయ్యే నిజం. చిన్న మాట అయినా, అందులోని లోతు ఎంతగా ఉంటుందో – అది కోల్పోయినప్పుడు, లేదా నెరవేరనప్పుడు మాత్రమే తెలుస్తుంది. మన దగ్గర ఉన్నవాటిని ఎంత సులభంగా తీసుకుంటామో... వాటిని కోల్పోయిన తరువాతే వాటి అవసరం ఎంతవో మనం గమనించగలుగుతాం.

ఒక మంచి స్నేహితుడు, ఒక మంచి పుస్తకం, మనసుకు ఊరటనీచ్చే ఒక పూల మొక్క, ఇలా ఏదైన సరే.… 

మన మాటకి స్పందించే వ్యక్తి… వాళ్లు దూరమయ్యాకే, వాళ్లతో గడిపిన క్షణాలు మర్చిపోలేని జ్ఞాపకాలుగా మనలో నిలిచిపోతాయి. మనం ఊహించినా, ఊహించకపోయినా – బాధ అనిపించేది వాళ్లు మనతో లేకుండా పోయిన తరువాతే.

మనిషి జీవితంలో ప్రతి అనుభవం ఓ పాఠం. కొన్ని మనల్ని మారుస్తాయి. కొన్ని లోతుగా ఆలోచించమంటాయి. 
ఏదైనా మనం కోల్పోయినప్పుడు అది బయటకు పోతుంది, కానీ అది మనలో ఒక జ్ఞాపకంగా తాపంగా నిలిచిపోతుంది.
కోల్పోయిన వాటి విలువ, అవి మనకు నేర్పినది – మనం వాటిని తిరిగి పొందలేమన్న నిజం మన హృదయంలో బరువుగా దాగినప్పుడే గుర్తొస్తుంది.

"జీవితం మన చేతుల్లో ఉన్నప్పుడు, దాని విలువ మనకు అర్థం కాదు. అది దూరమైన తరువాతే – మనం వేసిన చిన్న తప్పులే మనసును కలచివేస్తాయి."

మనకు మాట్లాడాలనిపిస్తే వెంటనే మాట్లాడాలి. పలకరించాలనిపిస్తే పిలవాలి. మనం చెప్పాలనుకున్న మాటలు కాలానికి వాయిదా వేస్తే – ఆ మాటల కోసం ఒక రోజు మనమే ఎదురుచూసే పరిస్థితి వస్తుంది.

మనసులో ఉన్న ప్రేమను పంచుకోకపోతే, చెప్పలేకపోయిన మాటలు మన లోతులో నిశ్శబ్దంగా ప్రతిధ్వనిస్తాయి. ఒక్క చిరునవ్వు, ఒక హత్తు – ఇవి ఎవరి జీవితాన్నైనా మారుస్తాయి. అందుకే ఏ సందర్భంలోనైనా మనసులో ఉన్నది బయటపెట్టాలి.

కన్నీటి వెనుక ఉన్న నిశబ్దాన్ని విన్నప్పుడే మనం నిజంగా ఎదిగినట్టు తెలుస్తుంది.

ప్రతి విడిపోవడంలో ఒక ఆత్మాంతరగమనముంది – అది నిష్కల్మషంగా మనల్ని మనలోకి తీసుకెళ్తుంది.
కొన్ని క్షణాలు తిరిగిరావు. కొన్ని మాటలు తిరిగి వినిపించవు. వాటి కోసం మనం ఎప్పటికీ ఎదురుచూస్తూనే ఉంటాం.

మన దగ్గర ఉన్నవాటిని గౌరవించాలి. మనతో ఉన్నవాళ్లను ప్రేమించాలి. వారిని పట్టించుకోకపోతే – ఒక్కరోజు వారే మన జ్ఞాపకాలుగా మిగిలిపోతారు. వాళ్లు ఉన్నప్పుడు అర్థం కాని సన్నివేశాలు, పోయిన తరువాత మాత్రం మనసంతా నింపేస్తాయి.

మనకోసం కాసేపు వేచిచూసే మనుషులకే మనం టైం ఇవ్వకపోతే, కాలమే మనని ఒంటరిగా ఎదురుచూసేలా చేస్తుంది.
ప్రేమ ఉన్నట్టు అనిపిస్తే – తడబడకుండా చెప్పండి.
బాధలుంటే – పంచుకోండి.
కలసి మాట్లాడాలని అనిపిస్తే – మొహమాటపడకండి.
అపార్థం జరిగితే – మౌనంగా ఉండకండి.
క్షమించండి. మర్చిపోండి.
చిరునవ్వుతో ఈ రోజును మొదలుపెట్టండి.

మీకు తెలుసా… మనిషి పుట్టుక నుండి మరణం వరకూ ప్రతి జీవిత ఘట్టాన్ని ఏదో రూపంలో సెలబ్రేట్ చేసుకుంటాడు.
అందులోని భావన ఒక్కటే.. జీవితం ఒంటరిది కాదు అని.
ఆనందాన్ని, విషాదాన్ని, విజయాన్ని, వైఫల్యాన్ని నలుగురితో పంచుకోవాలన్న ఆత్మబంధం మనిషిలో పుట్టుకతోనే వస్తుంది.

తరతరాలుగా సాగుతున్న ఈ ఆచారం ఎందుకు కొనసాగుతుందో తెలుసా?
సందర్భం ఉన్నా లేకపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా, మనుషులు మనుషులతో కలిసి ఉండాలనుకుంటారు.
అదే జీవితం గొప్పతనం. పలకరించుకోవడం, దగ్గరయ్యేలా ఉండటం, ఒకరి జీవితాన్ని మరొకరితో ముడిపెట్టుకోవడం. ఇవే మన మానవతా స్వభావానికి మూలగుణాలు.

మనుషుల మధ్య ఆ అనుబంధమే జీవితం అనే ప్రయాణాన్ని అద్భుతంగా మార్చుతుంది.

అందుకే, కొన్ని చిన్న సంభాషణలు మన జీవితం మొత్తాన్నే మార్చేయగలవు.
మాటలు కనుమరుగవ్వక ముందే వినిపించాలి.
మనుషులు దూరమవకముందే పట్టించుకోవాలి.

కొన్ని నిమిషాల విలువ మనం తర్వాత తెలుసుకుంటే, గతంపై బాధపడటం తప్ప ఇంకేమీ మిగలదు.

అందుకే నా మట్టుకు నేను జీవితంలోని ప్రతి సందర్భాన్ని మిత్రులతో కలిసి వేడుకలా జరుపుకుంటాను. ఏ అంశం లేకపోయినా కనీసం ఏదో ఒక సోషల్ గేదరింగ్ పేరుతో జరిగే కార్యక్రమాలలోనైనా వెళ్లి కలుస్తాను. కొన్నిసార్లు నేనే ఎగ్జిబిషన్ పేరుతోనో, ఫోటో వాక్ పేరుతోనో, క్యాంపింగ్ పేరుతోనో మ్యూజికల్ నైట్ పేరుతోనో రకరకాల సందర్భాలని, రకరకాల పండుగలకి ఒక సందర్భన్ని కల్పించుకొని ప్రోగ్రాములు ఏర్పాటు చేసి మన అనుకున్న వాళ్ళందరూ కూడా కలిసే ఏర్పాటు చేస్తుంటాను

No comments:

Post a Comment