అసలు ఆ భగవంతుడు మనల్ని ఎందుకు సృష్టించినట్టు, ఇలా ఎందుకు రకరకాలైన కష్టాలు పెడుతూ మనల్ని ఎందుకు బాధిస్తున్నట్టు ?
సృష్టించాడు సరే, పోనీ మానవు లందరినీ అన్నీ విషయాలలో అన్నీ సమంగా ఇచ్చి సృష్టించకుండా మానవుల్లో ఈ హెచ్చుతగ్గులు ఎందుకు చేసినట్టు ?
మనుషు లందరినీ ఇలా రకరకాలుగా సృష్టి చేసి వాళ్ళని ఇలా అనేక రకాలుగా కష్టాలకి గురిచేయడం ఎందుకు ? అసలు సృష్టించకుండానే ఉండచ్చు కదా ?
భగవంతుడికి ఈ వినోదం ఎందుకు అని సందేహం వస్తుంది. ఇది ఆధ్యాత్మిక చింతన గల ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా అర్ధం చేసుకోవలసిన విషయం.
మనల్ని పుట్టించింది ఆ భగవంతుడే అన్నది నిజం. అయితే మానవులని గానీ మరే ఇతర జీవులని పుట్టించడంలో గానీ అనేక రకాలైన తేడాలున్నాయి అన్నది కూడా నిజం. అయితే ప్రతి మనిషికి మనిషికి ఉన్న అన్నీ రకాలైన వ్యత్యాసాలకూ భగవంతుడికి ఏమీ సంబంధం లేదు, ఉండదు. అది ఎలా ఆంటే..
దాన్ని ఒక చిన్న ఉదాహరణ రూపంలో చూద్దాం :
మీరు స్వయంగా మీ చేతులతోనే, అన్నీ ఒకే రకంగా ఉన్న ఒక దోసెడు విత్తనాలని తీసుకుని, ఒకే రకమైన మట్టిలో జల్లి, గాలీ, వెలుతురు, లేదా ఎండ సమంగా తగిలేలా, అన్నిటికీ ఒకే రకంగా నీరు పెట్టారు అనుకుందాం. కానీ అవన్నీ ఒకే సారి మొలకలు రావు. అన్నీ ఒకేలా మొలవ్వు. కొన్ని అసలు మొలకే ఎత్తవు. కొన్ని మొలక లోనే చనిపోతాయి. కొన్ని చిన్నగా మొలకెత్తుతాయి. మరి కొన్ని కొంచం పెద్దగా లేస్తాయి. రోజులు గడిచినా ఆ మొలకెత్తిన వాటిల్లో కొన్ని చిన్న మొక్కలుగానే ఉంటే కొన్ని చాలా పెద్ద మొక్కలు అవుతుంటాయి. కొన్నిటికి చీడ లాంటివి పట్టి అందవిహీనంగా అయితే, కొన్నిటికి ఏ చీడ లేకుండా పచ్చగా కళకళ లాడుతూ ఉంటాయి, కొన్ని ప్రకృతి వైపరీత్యాలకి గురై నాశనమైతే కొన్ని తట్టుకుని నిలబడతాయి, కొన్ని పూలు పళ్ళు ఇస్తే, కొన్ని అవేమీ ఇవ్వని ఫలపుష్పరహితమవుతాయి.
అలా ఎన్నో రకాలుగా అవి కూడా సుఖ దుఃఖాలకి హెచ్చుతగ్గులకి లోనవుతున్నాయి. అలా ఎందుకు అవి అయ్యాయి అంటే మీరు ఏం సమాధానం చెప్తారు ?
ఆలోచించండి అలా కావడానికి కారణం ఎక్కడ ఉంది ?
మీ చేత్తో మీరు స్వయంగా విత్తనాలు చల్లే ముందు అన్నీ ఒకేలా ఉన్నాయి, మీరు వాటిని చల్లిన మట్టి కూడా ఒకటే, నీళ్ళు కూడా అన్నిటికీ సమంగానే పెట్టారు, వాటికి అందాల్సిన గాలీ వెల్తురు కూడా అన్నీ సమంగానే అందించారు, అయినా అలా ఒక్కోటి ఒక్కో విధంగా ఎందుకు అయినట్టు ?
మీరు చల్లిన విత్తనాలలో కొన్నిటి మీద మీరు ఎందుకు పక్షపాతం చూపించారు ?
వాటిల్లో కొన్నిటిని ఎందుకు మొలకెత్తకుండా చేశారు ?
కొన్నిటిని ఎందుకు పొట్టిగానే ఉండేలా చేశారు ? కొన్నిటినే కాయలు, పూలు పూసేలా ఎందుకు వాటిల్లో అలా ఎక్కువ తక్కువలు చేశారు ?
అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు ?
ఏమో నాకేం తెలుసు నేను మాత్రం ఒకే రకమైన విత్తనాలని ఒకే రకమైన మట్టిలో జల్లాను అన్నిటికీ సమంగానే నీళ్ళు పెట్టాను కానీ అవి ఎందుకని అలా అయ్యాయో నాకు తెలియదు అని వెంటనే చెప్తారు.
ఇంకా ఆ గింజల్లో ఎంతుందో అందులోంచి అంతే వస్తుంది గానీ లేనిది ఎక్కడి నుంచి వస్తుంది అంటారు అవునా ?
కాబట్టి మొదట్లో పైన మనకి వచ్చిన సందేహాలకి దేవుడిని అడిగినా ఇదే సమాధానం చెప్తాడు అని అర్ధం చేసుకోవాలి ! ఆదిత్యయోగీ.
మానవులంతా పలురకాలైన హెచ్చుతగ్గుల్లో ఉండటానికి కారణం ఎక్కడ ఉన్నట్టు అంటే దానికి సమాధానం ఇలా ఉంటుంది.
ఈ సమస్తమైన మానవులంతా ఆ గింజల్లాంటి వాళ్ళు. ఎవరి కర్మలని వాళ్ళు మంచి చెడు ఏదైనా వాళ్ళతోనే పుచ్చుకుని తిరుగుతూ ఉంటారు. భగవంతుడి ఎవరికీ ఏదీ కొత్తగా పట్టుకొచ్చి ఇవ్వడూ, ఉన్నదాన్ని తీసెయ్యడు. బ్యాంక్ లో మన ఖాతాలో ఉన్న డబ్బుని జాగ్రత్తగా మనకే అట్టిపెట్టినట్టు భగవంతుడు ఎవరి ఖాతాలో ఉన్న పాపపుణ్యాలని వాళ్ళకే జాగ్రత్తగా అప్పజెపుతాడు.
దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవలసిన సృష్టి రహస్యం ఒకటి ఉంది. ఎలా అంటే విత్తనాలలో జీవశక్తి ఉన్నా అవి పడాల్సిన చోటు, ఉండాల్సిన వాతావరణం, తగలాల్సిన తేమ తగిలితేనే అవి మొలకెత్తుతాయి.
అలా కాకుండా ఏ సంచి లోనో, ఏ డబ్బా లోనో పెట్టి మూత పెడితే అవి మొలకెత్తవు. ఎందుకంటే పైన చెప్పిన మూడు పరిస్థితులు లేకుండా ఆ విత్తనానికి మొలకెత్తడం చేతకాదు. అది మొలకెత్తటానికి ఎవరో ఒకరు దానికి అది మొలకెత్త టానికి తగిన పరిస్థితులని కలిగించాలి. అప్పుడు మాత్రమే అది దానిలో ఉన్న దాని జీవశక్తిని బట్టి మొలకెత్తి అది ఏంటో ఎలా పెరుగుతుందో, ఏమేమి ఫలపుష్పాలు ఇస్తుందో మనకి ఇచ్చి చూపించగలదు.
అదే విధంగా మానవులతో సహా సమస్త జీవరాసులు ఏ మహా ప్రళయంలోనో యుగాంతంలోనో పూర్తిగా నశించి కొంత కాలం పాటు ఏవిధమైన శరీరాలు లేకుండా పడి ఉన్నప్పుడు, ఆ మహా ప్రళయం సంభవించిన సమయానికి ఆయా మానవుల వెనక ఏ విధమైన కర్మలు, సంస్కారాలైతే ఉన్నాయో అవన్నీ తరిగించుకొని ఉద్దరించబడటానికి మళ్ళీ ఏదైనా తగిన శరీరం ఉంటే తప్ప వాళ్ళ వెనకన ఉన్నకర్మలని తరిగించుకోలేరు. అందుకని ఎవరి చేసుకున్న కర్మ ప్రకారం ఎవరికి తగ్గట్టు వారికి ఒక్కొక్క శరీరాన్ని ఆ భగవంతుడు తయారుచేసి ఇస్తాడు.
అలా శరీరాన్ని నీకు ఇస్తూ, దాంతో పాటు మానవుల నడవడికి సంబంధించిన కొన్ని నియమాలని కూడా ఆయా దేహాలకి వర్తింపజేస్తూ వాటి ప్రకారం నడుచుకోమని చెప్పి పంపుతాడు. తాను చెప్పినట్టు నడుచుకుంటే మానవుల పాపాల పుట్టని అంతా తాను పరిహారం చేస్తాను అని కూడా చెప్పి పంపుతాడు.
ప్రతి మానవుడికి తాను చేసిన కర్మకి తగ్గట్టుగా అతనికి కావలసిన శరీరాన్ని మానవుడు తెచ్చుకోలేడు కాబట్టి దాన్ని భగవంతుడు సృష్టించి ఇస్తాడు తప్ప అలా చేయడంలో ఆయనకి ఏవిధమైన పక్షపాతము ఉండదు.
ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇదంతా భగవంతుడి ఆధీనంలో ఉన్న “ప్రకృతి” లో ఒక ఆటోమేటిక్ సిస్టమ్ లాగా ఎవరు ఏ శరీరంతో, ఎక్కడ, ఎలా పుట్టాలో, ఏ విధమైన జీవితం గడపాలో, దానివలన మావవులలో ఎలాంటి పరివర్తన రావాలో అన్నది నిర్విరామంగా జరిగిపోతూనే ఉంటుంది.ఆదిత్యయోగీ.
అందువలన ఒకళ్లని అన్నీ విధాలా బాగా సృష్టించి, కొందరిని అన్నీ విధాలా హీనంగా, లేదా తక్కువగా సృష్టించడం అనేది ఉండదు.
ఎవరి కర్మకు తగ్గట్టుగా వారి వారి శరీరాలు ఆయా కర్మలని అనుభవించే విధంగా ఈ ప్రకృతి లోంచి తయారు అవుతాయి.
భగవంతుడు “నన్ను పరిపూర్ణంగా ఆశ్రయించు నీ యోగ క్షేమాలు నేను చూస్తాను” అన్నాడు అంటే.. తాను చెప్పినట్టుగా మానవుడు ప్రవర్తించగలిగితేనే చూస్తాను అన్నాడు తప్ప మానవుడు తన ఇష్టం వచ్చినట్టు చేస్తే తను చూస్తాను అని అనలేదు.
కాబట్టి మానవుల్లో హెచ్చుతగ్గులు తేడాలు అన్నీఎవరికి వారు తెచ్చిపెట్టుకున్నవే తప్ప వాటితో భగవంతుడికి ఏ మాత్రం సంబంధం లేదు. అయితే మానవులు గతంలో చేసిన తప్పులని తిరిగి చేయకుండా ఉండేలా చేసే ప్రయత్నంలో భగవంతుడి సహాయం అందరిమీద ఒక్కలానే ఉంటుంది. ఎక్కడా తేడా ఉండదు.
“ఈ ప్రాపంచిక విషయాల మీద విరక్తి భావంతో” తనని “అన్యధా శరణం నాస్తి” అని వచ్చిన వాళ్ళని తప్పక రక్షించి తీరుతాను అని భగవంతుడు సమస్త మానవాళికి ఇచ్చిన మాట ..
పార్వతి దేవికి దండం పెట్టడం అంటే --
నీలో ఉన్న ''శక్తి''కి దండం పెట్టడం.
లక్ష్మీ దేవికి దండం పెట్టడం అంటే --
నీలో ఉన్న ''సంపద"కు దండం పెట్టడం.
సరస్వతి దేవికి దండం పెట్టడం అంటే --
నీలో ఉన్న ''జ్ఞానాని''కి దండం పెట్టడం..*
.
మనలో రాజసమైన ఆలోచనే, చివరికు అభివృద్ధి చెంది, మన లక్ష్యం వైపు మనల్ని నడిపిస్తుంది. మహర్షులు ఒకరి తరువాత మరొకరు స్వానుభవ పూర్వకంగా తెలుసుకున్న విషయాలను జోడించి, ఈ రాజయోగాన్ని మెరుగుపరుస్తూ, ఎంతో అభివృద్ధి చేశారు. చెప్పాలంటే, ఆ ఆలోచన చివరికి సత్ తత్వ రూపాన్ని దాల్చి నగ్న రూపంలో దర్శనమిస్తుంది. ఉన్నత స్థాయికి చెందిన దివ్య దృష్టి గలవారు దానిని పరిశీలించ వచ్చు. ఈ శాస్త్రాన్ని అనేక పద్ధతులలో బోధించవచ్చు. కానీ వాటన్నింటిలోనూ గల మూలసూత్రం మాత్రం ఒకటే. ఈ శక్తి సహాయంతో భగవంతునితో అనుసంధానాన్ని ఏర్పరచుకుంటాం. ఆయా కాలపు అవసరాలకు తగ్గట్టుగా దీనిని అభివృద్ధి చేసేందుకు, గొప్ప గొప్ప ఋషులు దీనిని మెరుగుపరుస్తూ వచ్చారు. యోగశాస్త్ర తత్వాన్ని విస్తృతంగా చర్చిస్తూ, ఈ విషయంపై చాలా వ్యాఖ్యానాలు వ్రాయబడ్డాయి. అయితే వాటన్నింటి సారాంశం అంతర్దృష్టి గురించే, మనిషి దానిని పెంపొందించుకోవాలి. లోతుగా అన్వేషిస్తూ తన సూక్షత్వాన్ని అత్యున్నతంగా మెరుగుపరుచుకుంటూ ముందుకు చొచ్చుకు పోగలదీరునికే విషయాలు వాటి నిజమైన దృష్టి కోణంలో కనబడి, వాటి మర్మం వెల్లడి జేయబడుతుంది.....*
.